India vs Australia: విరాట్ కోహ్లీ ఖాతాలో మరో అరుదైన ఘనత.. సచిన్ రికార్డు బద్దలు!
ABN , First Publish Date - 2023-02-19T16:03:28+05:30 IST
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియాతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో కోహ్లీ ఈ ఘనత సాధించాడు.
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. అత్యంత వేగంగా 25 వేల పరుగులు సాధించిన క్రికెటర్‌గా కోహ్లీ రికార్డులకెక్కాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియాతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఈ రికార్డ్ విరాట్ సొంతమైంది. 549 అంతర్జాతీయ మ్యాచుల్లో కోహ్లీ 25 వేల పరుగులు సాధించాడు. ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న సచిన్(Sachin Tendulkar) రికార్డును కోహ్లీ బద్దలుగొట్టాడు. సచిన్ ఖాతాలో మొత్తం 34,437 పరుగులున్నాయి. టెండూల్కర్ 577 ఇన్నింగ్స్‌లలో 25 వేల పరుగులు సాధిస్తే కోహ్లీ 28 మ్యాచ్‌ల ముందే ఆ రికార్డును అందుకున్నాడు.
కోహ్లీ, సచిన్ తర్వాతి స్థానాల్లో రికీ పాంటింగ్ (588), జాక్వెస్ కలిస్ (594), కుమార సంగక్కర (608), మహేల జయవర్ధనె (701) ఉన్నారు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన వారిలో కోహ్లీ ఆరోవాడు కాగా, రెండో ఇండియన్ బ్యాటర్. 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన విరాట్ అనతి కాలంలో అత్యుత్తమ ఆటగాడిగా ఎదిగాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 11 వేల పరుగులు సాధించిన రికార్డు కూడా అతడి పేరునే ఉంది. అలాగే, 105 టెస్టుల్లో 8,131 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు ఉన్నాయి. అలాగే, 115 టీ20ల్లో 4,008 పరుగులు చేశాడు.
664 మ్యాచుల్లో 34,357 పరుగులు చేసిన సచిన్ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర 594 మ్యాచుల్లో 28,016 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. రికీ పాంటింగ్ ( 560 మ్యాచుల్లో 27,483), మహేల జయవర్ధనె (652 మ్యాచుల్లో 25,957), జాక్వెస్ కలిస్ (519 మ్యాచుల్లో 25,534) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇటీవలి కాలంలో విరాట్ కోహ్లీ వైట్‌బాల్ క్రికెట్‌లో ఇరగదీస్తున్నాడు. అయితే, రెడ్ బాల్ క్రికెట్‌లో మాత్రం కొంత ఇబ్బంది పడుతున్నాడు. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల్లో ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు.