India vs New Zealand: కివీస్‌తో తొలి టీ20.. టాస్ గెలిచిన టీమిండియా

ABN , First Publish Date - 2023-01-27T18:54:08+05:30 IST

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్-కివీస్ మధ్య ఇక్కడి

 India vs New Zealand: కివీస్‌తో తొలి టీ20.. టాస్ గెలిచిన టీమిండియా

రాంచీ: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్-కివీస్ మధ్య ఇక్కడి జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో మరికాసేపట్లో తొలి మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) మరోమాటకు తావులేకుండా కివీస్‌(Kiwis)కు బ్యాటింగ్ అప్పగించాడు. ఇంతకుముందు జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. ఈ సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. యుజ్వేంద్ర చాహల్, జితేశ్ శర్మ, ముకేశ్ కుమార్, పృథ్వీ షా బెంచ్‌కు పరిమితమయ్యారు.

వన్డే సిరీస్‌లో పెద్ద స్కోర్లు చేయడంలో విఫలమైన సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌లో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు. మరోవైపు, వన్డే సిరీస్‌లో దారుణంగా విఫలమైన కివీస్ ఈ సిరీస్‌ను గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. రెండు మ్యాచుల్లో పోరాడినప్పటికీ విజయాన్ని అందుకోలేక చతికిలపడిన కివీస్ ఈసారి మాత్రం గట్టి పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ముఖ్యమంగా టాపార్డర్‌ను కాపాడుకోవడంపై దృష్టి సారించింది.

వన్డే సిరీస్‌లో చాలా సవాళ్లు ఎదుర్కొన్నామని కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్( Mitchell Santner) అన్నాడు. జట్టులో కొందరు కొత్త కుర్రాళ్లు ఉండడం, వారికి ఇండియాలో ఆడిన అనుభవం లేకపోవడం వంటివి తమకు సవాలుగా మారాయన్నాడు. అయితే, టీ20 సిరీస్‌లో మాత్రం సత్తా చూపుతామన్నాడు. టామ్ లాథమ్, నికోలస్ బెంచ్‌కు పరిమితం కాగా, చాప్‌మన్, సోధీ జట్టులోకి వచ్చారు.

భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావీ, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్

న్యూజిలాండ్ జట్టు: ఫిన్ అలెన్, డెవోన్ కాన్వే (వికెట్ కీపర్), మార్క్ చాప్‌మన్, డరిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, జాకోబ్ డుఫీ, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నెర్

Updated Date - 2023-01-27T18:54:10+05:30 IST