IND vs AUS: వరల్డ్ కప్‌లో శుభారంభం చేసిన భారత్.. ఆస్ట్రేలియాపై విజయం.. ఆ ఇద్దరి వల్లే సాధ్యం
ABN , First Publish Date - 2023-10-08T22:09:15+05:30 IST
వరల్డ్ కప్ 2023లో భారత జట్టు శుభారంభం చేసింది. ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన...
వరల్డ్ కప్ 2023లో భారత జట్టు శుభారంభం చేసింది. ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని భారత్ 6 వికెట్ల తేడాతో ఛేధించింది. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (85), కేఎల్ రాహుల్ (97 నాటౌట్) అద్భుతంగా రాణించడం వల్లే టీమిండియాకు విజయం దక్కింది. 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు.. వీళ్లిద్దరు బరిలోకి దిగి జట్టుని కాపాడారు. ఆచితూచి ఆడుతూ ఆస్ట్రేలియా బౌలర్లకు చెమటలు పట్టించారు. నాలుగో వికెట్‌కి ఏకంగా 167 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి.. జట్టుని విజయతీరాలకు చేర్చారు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 49.3 ఓవర్లలో 199 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ జట్టు పేకమేడల్లా కుప్పకూలింది. కేవలం వార్నర్ (41), స్టీవ్ స్మిత్ (46) మాత్రమే పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లెవ్వరూ సత్తా చాటలేకపోయారు. ఇక 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 41.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేధించింది. వాస్తవానికి.. భారత్‌కు ఆదిలోనే పెద్ద ఝలక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ డకౌట్ అయ్యారు. ఈ దెబ్బకు భారత జట్టు కష్టాల్లో పడింది. 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడంతో.. ఈ 200 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఛేధించగలుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అప్పుడే మేమున్నామంటూ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ జట్టుని ఆదుకున్నారు. అసాధ్యమనుకున్న ఫీట్‌ని సుసాధ్యం చేసి.. అందరి మన్ననల్ని చూరగొంటున్నారు.
నిజానికి.. విరాట్ కోహ్లీ 12 వ్యక్తిగత పరుగుల వద్దే క్యాచ్ ఔట్ అవ్వాల్సింది. కానీ.. మిచెల్ మార్ష్ ఆ క్యాచ్‌ని వదిలేశాడు. బంతి గాల్లో చాలాసేపటి వరకు ఉన్నప్పటికీ.. అతడు సరిగ్గా అందుకోలేకపోయాడు. ఇలా తనకొచ్చిన లైఫ్‌ని కోహ్లీ సద్వినియోగపరచుకొని.. 85 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని జోడించాడు. ఇక లక్ష్యం దగ్గరపడేకొద్దీ కోహ్లీ దూకుడు పెంచుతూ వచ్చాడు. అతడు సెంచరీ చేయడం ఖాయమని అనుకున్న తరుణంలో.. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి, పెవిలియన్ చేరాడు. కోహ్లీ తర్వాత వచ్చిన పాండ్యాతో కలిసి.. కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌ని ముగించాడు. సిక్స్ కొట్టి భారత్‌ని గెలిపించాడు.