IPL 2023: ఎట్టకేలకు అర్జున్ టెండూల్కర్ ఎంట్రీ!
ABN , First Publish Date - 2023-04-16T15:54:42+05:30 IST
సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) అభిమానులకు ఇది శుభవార్తే. ఎప్పుడెప్పుడా అని
ముంబై: సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) అభిమానులకు ఇది శుభవార్తే. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar) ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. అంతేకాదు, ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన అర్జున్ తొలి ఓవర్ వేసి బ్యాటర్లను భయపెట్టాడు. బ్యాటింగులోనూ సత్తా చాటగల అర్జున్ గతేడాది గోవా జట్టు తరపున రంజీల్లో అడుగుపెట్టి సెంచరీ చేశాడు. ఇప్పుడు కోల్‌కతాతో మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు.
2021లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అర్జున్ టెండూల్కర్‌ను బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసింది. అయితే, ఆ సీజన్‌లో తుది జట్టులో స్థానం లభించక బెంచ్‌కే పరిమితమయ్యాడు. గతేడాది జరిగిన మినీ వేలంలోనూ అర్జున్‌ను మళ్లీ కొనుగోలు చేసింది. నేటి మ్యాచ్‌లో మాత్రం తుదిజట్టులో స్థానం సంపాదించడమే కాకుండా తొలి ఓవర్‌ను బౌల్ చేశాడు. అంతకుముందు రోహిత్ శర్మ చేతుల మీదుగా ఎంఐ క్యాప్ అందుకున్నాడు.
నేటి మ్యాచ్‌కు మరో ప్రాధాన్యం కూడా ఉంది. మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో ముంబై మహిళల జట్టు జెర్సీలు ధరించి ఆటగాళ్లు బరిలోకి దిగారు. ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ చొరవతో నిర్వహించిన ‘అందరికీ విద్య, క్రీడలు’ (ESA) దినోత్సవంలో ముంబై జట్టు పాల్గొంది. ఈ సందర్భంగా మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు 19 వేలమంది బాలబాలికలను స్టేడియంలోకి ఉచితంగా అనుమతించారు.