Javed Miandad: భారత జట్టును నియంత్రించలేని ఐసీసీ ఉండి ఎందుకు?.. దండగ!

ABN , First Publish Date - 2023-02-06T17:46:40+05:30 IST

ఆసియా కప్ 2023(Asia Cup-2023) విషయంలో భారత్-పాకిస్థాన్ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ ఏడాది ఆసియాకప్‌కు పాకిస్థాన్

Javed Miandad: భారత జట్టును నియంత్రించలేని ఐసీసీ ఉండి ఎందుకు?.. దండగ!

న్యూఢిల్లీ: ఆసియా కప్ 2023(Asia Cup-2023) విషయంలో భారత్-పాకిస్థాన్ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ ఏడాది ఆసియాకప్‌కు పాకిస్థాన్(Pakistan) ఆతిథ్యమివ్వనుంది. అయితే, టోర్నీ కనుక పాకిస్థాన్‌తో జరిగితే భారత జట్టు (Team India) అక్కడికి వెళ్లబోదని బీసీసీఐ(BCCI) కరాఖండిగా చెబుతోంది. అలాగైతే ఇండియాలో ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌లో తాము కూడా ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) తేల్చేసింది. ఈ నేపథ్యంలో ఆసియాకప్‌ను తటస్థ వేదికపై నిర్వహించాలని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 4న బహ్రెయిన్‌లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. గతేడాదిలానే టోర్నీని యూఏఈకి తరలించాలన్న చర్చ జరిగినట్టు సమాచారం. అయితే, వేదిక మార్పు విషయంలో మార్చిలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ వివాదంపై తాజాగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్(Javed Miandad) స్పందించాడు. పాకిస్థాన్‌కు ఇండియా మద్దతు అవసరం లేదని, సెప్టెంబరులో పాకిస్థాన్‌లో జరగనున్న ఆసియాకప్ కోసం భారత జట్టు రాకుంటే వచ్చిన ఇబ్బందేమీ ఉండదని తేల్చి చెప్పాడు.

అలాగే, భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఐసీసీపై మండిపడ్డాడు. ఆసియాకప్‌ కోసం పాకిస్థాన్‌లో పర్యటించబోనన్న భారత జట్టుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఐసీసీని ప్రశ్నించాడు. తాను గతంలోనూ ఇదే విషయాన్ని చెప్పానని గుర్తు చేశాడు. భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించకుంటే పోనివ్వాలని, దానివల్ల తమకొచ్చే ఇబ్బందేమీ లేదన్నాడు. భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించేలా చేయడం ఐసీసీ విధి అని, అది ఆ పని చేయలేకపోతే ఐసీసీ ఉండి ఉపయోగం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

భారతదేశం ఒక పవర్ హౌస్ అయితే కావొచ్చని, కానీ అది క్రికెట్‌ను శాసించలేదని మియాందాద్ అన్నాడు. ఆ జట్టు బలమైనదే అయితే అది దానికి గొప్ప కానీ తమకు, ప్రపంచానికి కాదన్నాడు. పాకిస్థాన్ వచ్చి క్రికెట్ ఆడాలని, అసలు ఎందుకు ఆడరని ప్రశ్నించాడు. పాకిస్థాన్‌లో కనుక భారత జట్టు ఓడిపోతే అక్కడి ప్రజలు అది సహించలేరని, అందుకే ఆ జట్టు రావడానికి భయపడుతోందని మియాందాద్ ఎద్దేవా చేశాడు. కాగా, 2025 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) హక్కులను కూడా పాకిస్థాన్ సొంతం చేసుకుంది.

Updated Date - 2023-02-06T17:46:42+05:30 IST