KL Rahul: రాహుల్‌కు ఇంకా చోటెలా లభిస్తోంది?: టీమిండియా మాజీ పేసర్ ప్రశ్న
ABN , First Publish Date - 2023-01-10T19:25:11+05:30 IST
టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul)ను పదేపదే జట్టుకు ఎంపిక చేయడంపై మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ (Venkatesh Prasad) తీవ్రస్థాయిలో స్పందించాడు
గువాహటి: టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul)ను పదేపదే జట్టుకు ఎంపిక చేయడంపై మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ (Venkatesh Prasad) తీవ్రస్థాయిలో స్పందించాడు. పదేపదే విఫలమవుతున్నా జట్టులో అతడికి స్థానం ఎలా లభిస్తోందంటూ సెలక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశాడు. జట్టును అదేపనిగా మారుస్తుండడం వల్ల పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో జట్టు ప్రదర్శన దెబ్బతింటుందని పేర్కొన్నాడు. శ్రీలంకతో వన్డేకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మాట్లాడుతూ.. ఇషాన్ కిషన్ కంటే శుభమన్ గిల్‌కే రెండో ఓపెనర్‌గా ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నాడు.
రోహిత్ నిర్ణయంపై వెంకటేశ్ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. గత వన్డేలో డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్‌ను ఎలా పక్కన పెడతారని మండిపడ్డాడు. డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిని పక్కన పెట్టడం సబబు కాదని అన్నాడు.
53 ఏళ్ల ప్రసాద్ భారత్ తరపున 33 టెస్టులు, 161 వన్డేలు ఆడాడు. మంచి ప్రదర్శన కనబరుస్తున్న ఆటగాళ్లపై వేటేయడం, జట్టును తరచూ మారుస్తుండడం వల్ల ప్రదర్శనపై ప్రభావం చూపిస్తోందని ప్రసాద్ పేర్కొన్నాడు. మంచిగా ఆడుతున్న ఆటగాడిని పక్కనపెట్టేసి మధ్యస్తంగా ఆడుతున్న క్రికెటర్‌ను తీసుకుంటున్నారంటూ సెలక్టర్లపై విమర్శలు చేశాడు.
ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేలో పంత్ సెంచరీ చేసి సిరీస్ విజయానికి కారణమయ్యాడని వెంకటేశ్ ప్రసాద్ గుర్తు చేశాడు. అయితే, టీ20 ఫామ్‌ను దృష్టిలో పెట్టుకుని వన్డేల నుంచి తప్పించారని అన్నాడు. కేఎల్ రాహుల్ మాత్రం వరుసగా విఫలమవుతున్నా జట్టులో మాత్రం అతడికి చోటు దక్కుతోందన్నాడు. ప్రదర్శనను కొలమానంగా తీసుకోకపోవడం విచారకరమని ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశాడు.