Team India: షమీ అదిరిపోయే రికార్డు.. అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్
ABN , First Publish Date - 2023-11-02T21:42:42+05:30 IST
ముంబైలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ షమీ చరిత్ర సృష్టించాడు. ప్రపంచకప్ హిస్టరీలో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ అదిరిపోయే ఫామ్‌లో ఉన్నాడు. దీంతో ప్రపంచకప్‌లో ప్రత్యర్థి జట్ల బ్యాటర్లు బెంబేలెత్తుతున్నారు. తాజాగా ముంబైలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ షమీ చరిత్ర సృష్టించాడు. ప్రపంచకప్ హిస్టరీలో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 2015, 2019, 2023 ప్రపంచకప్‌లలో ఆడిన షమీ ఇప్పటివరకు 14 వరల్డ్ కప్ ఇన్నింగ్స్‌లలో 45 వికెట్లు సాధించాడు. దీంతో జహీర్‌ఖాన్ రికార్డును అధిగమించాడు. జహీర్ ఖాన్ 44 వికెట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. జవగళ్ శ్రీనాథ్ కూడా 44 వికెట్లు తీయగా.. బుమ్రా 33 వికెట్లు, అనిల్ కుంబ్లే 31 వికెట్లు సాధించారు.
కాగా ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో తొలి నాలుగు మ్యాచ్‌లలో ఆడని మహ్మద్ షమీ తర్వాతి మూడు మ్యాచ్‌లలో ఆడాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడటంతో జట్టులోకి వచ్చిన షమీ తానెంత విలువైన ఆటగాడినో చాటిచెప్పాడు. న్యూజిలాండ్‌పై 5 వికెట్లతో చెలరేగిన అతడు ఇంగ్లండ్‌పై 4 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పుడు శ్రీలంకపై 5 వికెట్లు పడగొట్టి ఈ ప్రపంచకప్‌లో మొత్తం 14 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆరో స్థానానికి చేరాడు. కేవలం మూడు మ్యాచ్‌లలోనే షమీ 14 వికెట్లు సాధించి యావరేజ్ కేవలం 6.71 నమోదు చేయడం గమనించాల్సిన విషయం.