Share News

Mohammed Shami: ‘షమీ’శిఖరం.. వరల్డ్‌కప్ చరిత్రలోనే తొలిసారి.. ఇది మామూలు ఊచకోత కాదు

ABN , First Publish Date - 2023-11-15T22:57:13+05:30 IST

‘ఖలేజా’ సినిమాలో కష్టాల్లో ఉన్న ఒక ఊరి ప్రజల్ని కాపాడ్డానికి వచ్చిన మహేశ్ బాబు‌ని ఏ విధంగా అయితే దేవుడిలా కొలుస్తారో.. అదే విధంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత పేసర్ ‘షమీ’శిఖరంగా అవతరించాడు. ఒకటి కాదు, రెండు కాదు..

Mohammed Shami: ‘షమీ’శిఖరం.. వరల్డ్‌కప్ చరిత్రలోనే తొలిసారి.. ఇది మామూలు ఊచకోత కాదు

‘ఖలేజా’ సినిమాలో కష్టాల్లో ఉన్న ఒక ఊరి ప్రజల్ని కాపాడ్డానికి వచ్చిన మహేశ్ బాబు‌ని ఏ విధంగా అయితే దేవుడిలా కొలుస్తారో.. అదే విధంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత పేసర్ ‘షమీ’శిఖరంగా అవతరించాడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. వరల్డ్ కప్ చరిత్రలో భారత్ తరఫున ఏడు వికెట్లు తీయడం ఇదే మొదటిసారి. దీంతో.. షమీ తన పేరిట సరికొత్త రికార్డ్‌ని లిఖించుకున్నాడు. ఇంతకుముందు ఆశిష్ నెహ్రా 2003 వరల్డ్‌కప్‌లో ఆరు వికెట్లు తీసి, వరల్డ్‌కప్‌లోని సింగిల్ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర నెలకొల్పాడు. ఇప్పుడు షమీ ఏడు వికెట్లు పడగొట్టి.. ఆ చరిత్రను తిరగరాశాడు.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా ఓపెనర్లు బాగా రాణిస్తున్న తరుణంలో.. ఆరో ఓవర్ వేసేందుకు షమీ రంగంలోకి దిగాడు. తన తొలి ఓవర్‌లోని తొలి బంతికే అతను కాన్వే వికెట్‌ని పడగొట్టి ఖాతా తెరిచాడు. ఆ వెంటనే ఎనిమిదో ఓవర్‌లో రచిన్ రవీంద్ర వికెట్ తీసి.. కివీస్‌పై ఒత్తిడి తీసుకొచ్చాడు. అయితే.. కేన్ విలియమ్సన్, డేరిల్ మిచెల్ మాత్రం క్రీజులో పాతుకుపోయారు. భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా వాళ్లు ఔట్ అవ్వలేదు. నిజానికి.. ఒక దశలో విలియమ్సన్ క్యాచ్ ఔట్ అవ్వాల్సింది కానీ, దాన్ని షమీ వదిలేశాడు. దాంతో విలియమ్సన్ మరింత రెచ్చిపోయి ఆడాడు. అప్పుడు ‘ఎందుకు క్యాచ్ మిస్ చేశావంటూ’ షమీ మీద ఆన్‌లైన్‌లో ట్రోల్స్ పడిపోయాయి. మరోవైపు.. కివీస్ స్కోరు దూసుకుపోతోంది. దీంతో భారత బౌలర్లపై ఒత్తిడి పెరిగింది.


ఆ సమయంలో షమీకి బహుశా ‘ముల్లుని ముల్లుతోనే తీయాలన్న’ సామెత గుర్తొచ్చిందేమో.. తాను ఎవరి క్యాచ్ అయితే మిస్ చేశాడో, ఆ కేన్ విలియమ్సన్ వికెట్టే పడగొట్టాడు. 33వ ఓవర్ వేసేందుకు బరిలోకి దిగిన అతడు.. కేన్ వికెట్‌ని పడగొట్టాడు. అదే ఓవర్‌లోనే టామ్ లాథమ్‌ని కూడా ‘సున్నా’ పరుగులకే పెవిలియన్ పంపించేశాడు. ఈ దెబ్బతో మ్యాచ్ మొత్తం టీమిండియా వైపుకు టర్న్ అయ్యింది. అయితే.. మిచెల్ అప్పటికీ క్రీజులోనే ఉండటం, భారత బౌలర్లకు తలనొప్పిగా మారింది. ‘టెన్షన్ ఎందుకు మిత్రమా, నేనున్నా’ అని చెప్తూ.. తన ఐదో వికెట్‌గా మిచెల్‌ని ఔట్ చేసి, ఈ వరల్డ్‌కప్‌లో మూడో ఫైఫర్ (ఐదు వికెట్ల హాల్) నమోదు చేశాడు. మిచెల్ ఔట్ అవ్వడంతో.. భారత్ విజయం తథ్యమైపోయింది.

అప్పటికీ ఆకలి తీరని షమీ.. 49వ ఓవర్‌లో మరో రెండు వికెట్లు తీసేసుకున్నాడు. తొలుత రెండో బంతికి టిమ్ సౌథీని ఔట్ చేసిన మన పేసర్.. ఐదో బంతికి ఫెర్గ్యూసన్‌కు పెవిలియన్ దారి చూపించాడు. దీంతో.. వరల్డ్ కప్ టోర్నీలో ఏడు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా షమీ చరిత్రపుటలకెక్కాడు. ఏడు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించడంతో.. అతనికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ ఇచ్చారు. మరో విశేషం ఏమిటంటే.. లీగ్ దశలో కూడా షమీ కివీస్‌కి చుక్కలు చూపించాడు. లీగ్ దశలో న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో మ్యాచ్‌తో మైదానంలోకి అడుగుపెట్టిన షమీ.. ఆ మ్యాచ్‌లోనూ ఐదు వికెట్లు పడగొట్టి, కివీస్ బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. ఈ ఐదు వికెట్ల హాల్‌తో.. వరల్డ్‌కప్‌లో నాలుగు సార్లు ఫైఫర్ సాధించిన బౌలర్‌గానూ షమీ మరో రికార్డ్‌ని నెలకొల్పాడు.

Updated Date - 2023-11-15T22:57:15+05:30 IST