Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్ వేరే ఫ్రాంచైజీకి ఆడితేనా.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-04-21T15:20:41+05:30 IST
సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) తనయుడు అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar)
న్యూఢిల్లీ: సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) తనయుడు అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar) ఎట్టకేలకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అడుగుపెట్టి రెండు మ్యాచ్‌లు ఆడేశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders)తో జరిగిన మ్యాచ్‌తో అడుగుపెట్టిన ఈ ముంబై ఆల్‌రౌండర్ ఆ మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్(Bhuvneshwar Kumar) వికెట్ తీసి తన ఖాతాలో తొలి ఐపీఎల్ వికెట్ వేసుకున్నాడు. తొలి వికెట్ తీసుకున్న తర్వాత పలువురు క్రికెటర్ల నుంచి అర్జున్ ప్రశంసలు అందుకున్నాడు. అయితే, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్(Rashid Latif) మాత్రం అర్జున్ బౌలింగ్ తీరుపై పెదవి విరిచాడు.
అర్జున్ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాడని, మరింత కష్టపడాలని అన్నాడు. అతడి అలైన్‌మెంట్ బాగున్నా పేస్‌ను జనరేట్ చేయలేకపోతున్నాడని అన్నాడు. మంచి బయోమెకానికల్ కన్సల్టెంట్ అతడిని చక్కదిద్దగలడని చెప్పాడు. స్వయంగా సచిన్ కూడా ఆ పని చేయగలడని అన్నాడు. అర్జున్ తన బౌలింగ్‌కు మరింత పేస్‌ను జోడించగలడని చెప్పుకొచ్చాడు. అయితే, అతడి బ్యాలెన్స్ సరిగా లేకపోవడం వల్ల అది అతడి పేస్‌పై ప్రభావం చూపిస్తోందన్నాడు. ఏది ఏమైనా అర్జున్ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాడని, 135 కిలోమీటర్ల వేగం వరకు అతడు వెళ్లొచ్చని సూచించాడు. అర్జున్ మంచి బ్యాటర్ అని ప్రశంసించిన లతీఫ్.. మరో రెండుమూడేళ్లలో మంచి ఆటగాడవుతాడని తన యూట్యూబ్ చానల్ ‘కాట్ బిహైండ్’లో మాట్లాడుతూ చెప్పాడు. అర్జున్ కనుక మరే ఇతర ఫ్రాంచైజీకి అయినా ఆడి ఉంటే అతడి మైండ్‌సెట్ వేరేగా ఉండేదని అభిప్రాయపడ్డాడు.