Share News

India vs Australia: ఆస్ట్రేలియా జట్టుకి ప్రధాని మోదీ అభినందనలు.. కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్

ABN , First Publish Date - 2023-11-19T23:03:58+05:30 IST

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై గెలుపొంది.. ఆరోసారి ఛాంపియన్స్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ టోర్నీలో బాగా ఆడారని, అద్భుతంగా ఈ మెగా టోర్నీని...

India vs Australia: ఆస్ట్రేలియా జట్టుకి ప్రధాని మోదీ అభినందనలు.. కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై గెలుపొంది.. ఆరోసారి ఛాంపియన్స్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ టోర్నీలో బాగా ఆడారని, అద్భుతంగా ఈ మెగా టోర్నీని ముగించారని కొనియాడారు. వరల్డ్‌కప్‌లో చారిత్రాత్మక విజయం సాధించినందుకు శుభాకాంక్షలని ఎక్స్ వేదికగా విష్ చేశారు. అలాగే.. సెంచరీతో రాణించి ఆస్ట్రేలియా విజయంలో ప్రధాన పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్‌ని మెచ్చుకున్నారు. అటు.. ఓటమి పాలైన టీమిండియాకి కూడా ధైర్యం చెప్పారు. ఈ ప్రపంచకప్‌లో మీ ప్రతిభ, సంకల్పం చెప్పుకోదగినవి అని.. గొప్ప స్ఫూర్తితో ఆడి దేశానికి ఎనలేని గర్వాన్ని తెచ్చారని.. ఎల్లప్పుడూ మీతో ఉంటామని జట్టుకి అండగా నిలిచారు.


మరోవైపు.. ఈ వరల్డ్ కప్ మెగాటోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచి, 765 పరుగులతో సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీని ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డ్‌తో పురస్కరించారు. అయితే.. ఈ అవార్డ్ తీసుకునే సమయంలో కోహ్లీ ముఖంలో సంతోషం కన్నా దుఃఖమే కనిపించింది. వరల్డ్ కప్ గెలవలేదన్న బాధతోనే అతడు ఈ అవార్డ్‌ని అందుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ సైతం కంటతడి పెట్టాడు. ఈ టోర్నీలో జట్టుని విజయవంతంగా ముందుండి నడిపించిన ఈ నాయకుడు.. ఫైనల్‌లో ఓటమి పాలవ్వడంతో భావోద్వేగానికి గురయ్యాడు. మైదానంలోనే ఆటగాళ్లతో కరచాలనం చేస్తున్న సమయంలోనే అతడు బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. క్రీడాభిమానులు ఫీల్ అవుతున్నారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకి ఆలౌట్ అయ్యింది. రోహిత్ (47), కోహ్లీ (54), కేఎల్ రాహుల్ (66) మినహాయిస్తే.. ఇతర బ్యాటర్లెవ్వరూ రాణించలేకపోయారు. ఇక 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు.. 43 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసి విజయఢంకా మోగించింది. ఈ గెలుపుతో వాళ్లు ఆరోసారి ఛాంపియన్స్‌గా నిలిచారు. సెమీ ఫైనల్‌దాకా అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత బౌలర్లు.. ఈ ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం పెద్దగా రాణించలేకపోయారు. బుమ్రా రెండు వికెట్లు తీయగా.. షమీ, సిరాజ్ తలా ఒక వికెట్ మాత్రమే పడగొట్టారు.

Updated Date - 2023-11-19T23:03:59+05:30 IST