RCB vs GGT: జూలు విదిల్చిన గుజరాత్.. బెంగళూరుకు భారీ టార్గెట్!
ABN , First Publish Date - 2023-03-18T21:34:54+05:30 IST
చివరి ఓవర్‌లో గుజరాత్ చెలరేగింది. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది ఏకంగా 22 పరుగులు
ముంబై: చివరి ఓవర్‌లో గుజరాత్(Gujarat Giants) చెలరేగింది. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది ఏకంగా 22 పరుగులు పిండుకుంది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోరు సాధించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)కు సవాలు విసిరింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్‌కు 27 పరుగుల వద్ద షాక్ తగిలింది. మూడు ఫోర్లు బాది జోరుమీదున్నట్టు కనిపించిన సోఫియా డంక్లీ (16) డివైన్ బౌలింగులో క్లీన్ బౌల్డ్ అయింది.
అయితే, ఆ తర్వాత వచ్చిన సబ్బినేని మేఘన()Sabbhineni Meghanaతో కలిసి లారా వోల్వార్డ్ (Laura Wolvaardt) )వికెట్లను కాపాడుకుంటేనే బౌండరీలతో విరుచుకుపడింది. ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. వీరిద్దరి జోడీని విడదీసేందుకు బౌలర్లు శ్రమించారు. చివరికి 32 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసిన మేఘన 90 పరుగుల వద్ద రెండో వికెట్‌గా వెనుదిరిగింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన గార్డనర్.. వోల్వార్డ్‌కు చక్కని సహకారం అందించింది. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వోల్వార్డ్ ఆ తర్వాత కూడా అదే జోరు కనబరిచింది. 42 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసి అవుటైంది. గార్డనర్ కూడా క్రీజులో ఉన్నంత సేపు బౌలర్లపై విరుచుకుపడింది. 26 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 41 పరుగులు చేసి వెనుదిరిగింది.
అప్పటికే స్కోరు 160 పరుగులు దాటింది. అయితే, ఆ తర్వాతే అసలు మ్యాజిక్ మొదలైంది. హేమలత, హర్లీన్ డియోల్ చివరి ఓవర్‌లో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 20వ ఓవర్ రెండో బంతిని ఫోర్ కొట్టిన డియోల్.. మూడో బంతిని అద్బతమైన టైమింగ్‌తో సిక్సర్ బాదింది. నాలుగో బంతికి సింగిల్ రాగా, ఐదో బంతిని హేమలత సిక్స్ కొట్టి, ఆరో బంతిని బౌండరీకి తరలించింది. ఫలితంగా ఆ ఓవర్‌లో గుజరాత్‌కు 22 పరుగులు లభించాయి. ఫలితంగా స్కోరు బోర్డు 188/4 వద్ద ఆగింది. బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక పాటిల్‌కు రెండు వికెట్లు దక్కాయి.