Rohit Sharma: క్రికెట్ కిట్ కొనేందుకు రోహిత్ శర్మ ఆ పని కూడా చేశాడట !
ABN , First Publish Date - 2023-03-28T17:55:57+05:30 IST
తన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న
న్యూఢిల్లీ: తన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్లలో టీమిండియా సారథి రోహిత్ శర్మ(Rohit Sharma) ఒకడు. క్రికెట్‌లో ఒక్కోమెట్టూ ఎక్కుతూ వచ్చిన రోహిత్ ఎంతోమంది వర్ధమాన క్రికెటర్లకు ఆదర్శం. అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేక పేజీని లిఖించుకున్న రోహిత్ శర్మ ఒకానొక సమయంలో క్రికెట్ కిట్ కొనుగోలు చేసేందుకు ఎంతో ఇబ్బంది పడ్డాడు. ఈ విషయాన్ని ఒకప్పటి అతడి సహచరుడు, టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా(Pragyan Ojha) గుర్తు చేశాడు.
ఓఝా-రోహిత్ ఇద్దరి మధ్య జూనియర్ క్రికెట్ స్థాయి నుంచే పరిచయం ఉంది. 2008 ఐపీఎల్(IPL) ప్రారంభ ఎడిషన్‌లో డెక్కన్ చార్జర్స్(Deccan Chargers)కు కలిసి ఆడారు. పోటీ క్రికెట్‌లో అడుగుపెట్టిన తొలినాళ్లలో తన నేపథ్యం, క్రికెట్ కిట్ల కొనుగోలు కోసం పడిన కష్టాల గురించి చర్చించినప్పుడు రోహిత్ భావోద్వేగానికి గురయ్యాడని ఓఝా గుర్తు చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి తొలుత డెక్కన్ చార్జర్స్ తరపున ఆడారు. ఆ తర్వాత 2013, 2015 సీజన్‌లో ముంబైకి కలిసి ఆడారు.
ఓఝా-రోహిత్ కలిసి ఇండియా తరపున రెండు టెస్టులు సహా 24 మ్యాచులు ఆడారు. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. తాజాగా ‘జియో సినిమా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓఝా మాట్లాడుతూ.. రోహిత్‌కు సంబంధించి ఓ ఆశ్చర్యకరమైన ఘటనను గుర్తు చేసుకున్నాడు.
‘‘రోహిత్‌ను నేను తొలిసారి అండర్-15 జాతీయ క్యాంపులో కలిశాను. అతడో ప్రత్యేకమైన ఆటగాడని ప్రతి ఒక్కరు చెప్పేవారు. అక్కడ నేను అతడి వికెట్‌ను పడగొట్టాను. రోహిత్ ఎక్కువగా మాట్లాడడు కానీ, ఆడేటప్పుడు దూకుడుగా ఉంటాడు. మా ఇద్దరికీ ఒకరికొకరికి పరిచయం లేకపోయినా నాతో కూడా అలానే ఉండేవాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య పరిచయం కుదిరి అది క్రమంగా పెరిగింది’’ అని ఓఝా ఆ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు.
రోహిత్ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాడని, క్రికెట్ కిట్ కోసం తన బడ్జెట్‌ను ఎలా పరిమితం చేశారో చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడని పేర్కొన్నాడు. చాలా కాలం క్రితమే అయినా, పాల ప్యాకెట్లు కూడా వేశాడని ఓఝా గుర్తు చేశాడు. అలా అయినా క్రికెట్ కిట్ కొనుక్కోవచ్చన్నది అతడి ఆశ అని చెప్పుకొచ్చాడు. తమ ప్రయాణం ఎక్కడ మొదలై, ఎక్కడికి చేరుకుందన్న విషయం తెలిసి గర్వంగా ఉందని అన్నాడు.