IPL 2023: చివర్లో చెలరేగిన విజయ్ శంకర్.. కోల్‌కతా ఎదుట భారీ లక్ష్యం
ABN , First Publish Date - 2023-04-09T17:32:07+05:30 IST
కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) గైర్హాజరీ కారణంగా జట్టులోకి వచ్చిన విజయ్ శంకర్ (Vijay
అహ్మదాబాద్: కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) గైర్హాజరీ కారణంగా జట్టులోకి వచ్చిన విజయ్ శంకర్ (Vijay Shakar) కుమ్మేశాడు. కోల్‌కతా(KKR) బౌలర్లను ఆడేసుకున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో వీరవిహారం చేయడంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఈ మ్యాచ్‌కు స్టాండిన్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన రషీద్ ఖాన్ టాస్ గెలిచి వెంటనే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అతడి నమ్మకాన్ని బ్యాటర్లు నిలబెట్టారు. 33 పరుగులు వద్ద వృద్ధిమాన్ సాహా (17) అవుటైనప్పటికీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్ మరోమారు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 62 పరుగులు చేసిన సుదర్శన్.. ఈ మ్యాచ్‌లో 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు.
శుభమన్ గిల్ 39, అభినవ్ మనోహర్ 14 పరుగులు చేశారు. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్ (Vijay Shakar) కేకేఆర్ బౌలర్లను ఊచకోత కోశాడు. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీలకు పంపిస్తూ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. మొత్తంగా 24 బంతులు ఎదుర్కొన్న విజయ్ శంకర్ 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. పాండ్యా స్థానంలో వచ్చిన విజయ్ శంకర్ తనకొచ్చిన అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లు తీసుకోగా, సుయాస్ శర్మ్ ఒక వికెట్ తీసుకున్నాడు.