ODI World Cup: దక్షిణాఫ్రికా భారీ స్కోరు.. న్యూజిలాండ్ టార్గెట్ ఇదే..!!
ABN , First Publish Date - 2023-11-01T18:31:41+05:30 IST
వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోర్లు కొనసాగుతున్నాయి. ఈరోజు పూణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ సఫారీలు భారీ స్కోరు సాధించారు.
వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోర్లు కొనసాగుతున్నాయి. ఈరోజు పూణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ సఫారీలు భారీ స్కోరు సాధించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు చెమటలు పట్టించారు. ఓపెనర్ క్వింటన్ డికాక్, వాండర్ డుసెన్ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో దక్షిణాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఈ మెగా టోర్నీలో ఆడిన ఏడు మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా ఐదు సార్లు తొలుత బ్యాటింగ్ చేయగా అన్ని సార్లు 300 ప్లస్ స్కోరు సాధించింది. బంగ్లాదేశ్‌పై 382 పరుగులు, ఇంగ్లండ్‌పై 399 పరుగులు, ఆస్ట్రేలియాపై 311 పరుగులు, శ్రీలంకపై 428 పరుగులు, న్యూజిలాండ్‌పై 357 పరుగులు సాధించింది. పాకిస్థాన్‌పై సెకండ్ బ్యాటింగ్ చేసి 271, నెదర్లాండ్స్‌పై సెకండ్ బ్యాటింగ్ చేసి 207 రన్స్ చేసింది. దీంతో టాస్ గెలిచి తొలుత దక్షిణాఫ్రికాకు బ్యాటింగ్ అప్పగించాలంటే మిగతా టీమ్స్ ఆలోచించుకోవాల్సిందే.
కాగా ఇవాళ్టి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బాధ్యతాయుతంగా తన ఇన్నింగ్స్ నిర్మించింది. న్యూజిలాండ్ బౌలర్లపై ఆధిపత్యం కోసం చూడకుండా వీలు కుదిరినప్పుడే బౌండరీలు బాదడానికి డికాక్, డుసెన్ ప్రయత్నించారు. సాధారణంగా బౌలర్లపై ఎదురుదాడి చేసే డికాక్ ఈ మ్యాచ్‌లో కూల్‌గా ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతడి స్ట్రయిక్ రేట్ కూడా 100 కంటే తక్కువగానే నమోదైంది. 116 బాల్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 114 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. డుస్సెన్ 118 బాల్స్‌లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 133 పరుగులు సాధించాడు. డికాక్ అవుటైనా డేవిడ్ మిల్లర్ క్రీజులోకి వచ్చి బౌండరీలు బాదాడు. అతడు 30 బాల్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 53 రన్స్ చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ గాయంతో బయటకు వెళ్లిపోవడం దక్షిణాఫ్రికాకు కలిసొచ్చింది. సీనియర్ బౌలర్ సౌథీ మెగా టోర్నీలో తొలి మ్యాచ్ ఆడి నిరాశ పరిచాడు. 10 ఓవర్లలో 77 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. నీషమ్, బౌల్ట్ తలో వికెట్ పడగొట్టారు.