Virender Sehwag: డేవిడ్ వార్నర్‌కు సెహ్వాగ్ స్ట్రాంగ్ వార్నింగ్!

ABN , First Publish Date - 2023-04-09T18:36:42+05:30 IST

ఐపీఎల్‌(IPL 2023)లో ఢిల్లీ కేపిటల్స్‌(Delhi Capitals)ను పరాజయాలు వీడడం లేదు. ఆడిన

Virender Sehwag: డేవిడ్ వార్నర్‌కు సెహ్వాగ్ స్ట్రాంగ్ వార్నింగ్!

న్యూఢిల్లీ: ఐపీఎల్‌(IPL 2023)లో ఢిల్లీ కేపిటల్స్‌(Delhi Capitals)ను పరాజయాలు వీడడం లేదు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడిన ఢిల్లీ కేపిటల్స్ పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో ఉంది. శనివారం రాజస్థాన్ రాయల్స్‌(RR)తో జరిగిన మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. రిషభ్ పంత్(Rishabh Pant) గైర్హాజరీలో కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన డేవిడ్ వార్నర్(David Warner) రాయల్స్‌తో మ్యాచ్‌లో అర్ధ సెంచరీ (65) సాధించినప్పటికీ జట్టును మాత్రం ఓటమి నుంచి తప్పించలేకపోయాడు.

తాజా ఓటమి తర్వాత ఢిల్లీ కేపిటల్స్ మాజీ కెప్టెన్ సెహ్వాగ్(Virender Sehwag).. వార్నర్‌కు సీరియర్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ అర్ధ సెంచరీ నత్తనడక సాగిందన్న సెహ్వాగ్.. పరుగులు వేగంగా సాధించాలని, లేదంటే ఐపీఎల్ ఆడకుండా గమ్మున కూర్చోవాలని హెచ్చరించాడు. జట్టును మలుపు తిప్పాలనుకుంటే వేగంగా పరుగులు సాధించాల్సిందేనని తేల్చి చెప్పాడు. రాయల్స్‌తో మ్యాచ్‌లో వార్నర్ 55 బంతుల్లో 66 పరుగులు చేశాడు. సెహ్వాగ్ ఈ స్థాయిలో ప్రతిస్పందించడానికి ఇదే కారణం.

వార్నర్‌కు ఇప్పుడు ఇంగ్లిష్‌లో చెబితేనే బాధ అర్థమవుతుందన్న సెహ్వాగ్.. 55 బంతుల్లో 66 పరుగులు చేయడం కాదని, 25 బంతుల్లో 50 పరుగులు చేయాలని సూచించాడు. జైస్వాల్‌ను చూసైనా నేర్చుకోవాలన్నాడు. అతడు 25 బంతుల్లోనే బాదేశాడని గుర్తు చేశాడు. వార్నర్ ఆ పని చేయలేనప్పుడు ఐపీఎల్‌కు వచ్చి ఆడొద్దని కోరాడు. వార్నర్ 55-60 పరుగులు చేయడం కంటే 30 పరుగులకు అవుటైతేనే జట్టుకు మంచిదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

టీమిండియా మాజీ బ్యాటర్ రోహన్ గవాస్కర్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వెల్లడించాడు. ఐపీఎల్‌లో 6 వేలకు పైగా పరుగులు చేసిన వార్నర్ వంటి ఆటగాడిని ఇలా ఊహించుకోలేకపోతున్నట్టు చెప్పాడు. ఓ జట్టుకు కెప్టెన్ అయి ఉండి, బోల్డంత అనుభవం ఉండీ, ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 6 వేల పరుగులు చేసిన ఆటగాడిని ఇలా ఊహించుకోలేకపోతున్నట్టు చెప్పాడు.

వార్నర్ కనుక కెప్టెన్ కాకుంటే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి ఉండేవాడని జూనియర్ గవాస్కర్ అభిప్రాయడ్డాడు. అతడి స్థానంలో భారత యువ ఆటగాడు ఉండి ఉంటే అతడికి అదే చివరి మ్యాచ్ అయి ఉండేదన్నాడు. ఈ ఓటమికి వార్నర్ బాధ్యత వహించాల్సిందేనని రోహన్ గవాస్కర్ పేర్కొన్నాడు.

Updated Date - 2023-04-09T18:36:42+05:30 IST