INDW vs BANW: భారత్‌పై సెంచరీ కొట్టి చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ బ్యాటర్
ABN , First Publish Date - 2023-07-22T16:27:52+05:30 IST
భారత్ ఉమెన్స్‌తో జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ ఉమెన్స్ జట్టు ఓపెనర్ ఫర్గానా హోక్ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ఫర్గానా హోక్.. మహిళల వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్ తరఫున సెంచరీ కొట్టిన మొదటి బ్యాటర్‌గా చరిత్ర నెలకొల్పింది. ఈ క్రమంలో 10 ఏళ్ల నాటి రికార్డును ఫర్గానా హోక్ బద్దలుకొట్టింది.
ఢాకా: భారత్ ఉమెన్స్‌తో జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ ఉమెన్స్ జట్టు ఓపెనర్ ఫర్గానా హోక్ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ఫర్గానా హోక్.. మహిళల వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్ తరఫున సెంచరీ కొట్టిన మొదటి బ్యాటర్‌గా చరిత్ర నెలకొల్పింది. ఈ క్రమంలో 10 ఏళ్ల నాటి రికార్డును ఫర్గానా హోక్ బద్దలుకొట్టింది. 2013 ఏప్రిల్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్ సల్మా భారత్‌పై 75 పరుగులు చేసింది. ఇప్పటివరకు బంగ్లాదేశ్ మహిళల తరఫున వన్డేల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉంది. తాజాగా ఆ రికార్డును ఫర్గానా హోక్ అధిగమించింది. ఈ మ్యాచ్‌లో 107 పరుగులు బాదిన హోక్ బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసింది. వీటితోపాటు ఫర్గానా హోక్ మరో రికార్డులను కూడా ఖాతాలో వేసుకుంది. బంగ్లాదేశ్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు, అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలిచింది. కాగా బంగ్లాదేశ్ తరఫున ఇప్పటివరకు 56 మ్యాచ్‌లు ఆడిన ఫర్గానా హోక్ 25 సగటుతో 1240 పరుగులు చేసింది. అలాగే 9 హాఫ్ సెంచరీలు నమోదు చేసింది.
ఈ మ్యాచ్‌లో మొత్తంగా 160 బంతులు ఎదుర్కొన్న ఫర్గానా హోక్ 7 ఫోర్ల సాయంతో 107 పరుగులు చేసింది. 156 బంతుల్లో సెంచరీని పూర్తి చేసింది. ఈ క్రమంలో ఓ వన్డే మ్యాచ్‌లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న ఐదో బ్యాటర్‌గా నిలిచింది. ఇక ఫర్గానా హోక్ సెంచరీకి తోడు షమీమా సుల్తానా(52) హాఫ్ సెంచరీతో రాణించడతో బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. అనంతరం 226 పరుగుల లక్ష్య చేధనలో భారత జట్టు విజయం దిశగా పయనిస్తుంది. భారత మహిళలు 41 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేశారు.