Heath Streak: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. దిగ్గజ క్రికెటర్ బతికే ఉన్నారు!

ABN , First Publish Date - 2023-08-23T13:03:21+05:30 IST

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. జింబాబ్వే మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రీక్ చనిపోయారనే వార్తలు అవాస్తవం. ఆయన ప్రాణాలతోనే ఉన్నారు. ఈ విషయాన్ని హీత్ స్ట్రీక్ తోటి క్రికెటర్ హెన్రీ ఒలంగ వెల్లడించారు.

Heath Streak: క్రికెట్  ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. దిగ్గజ క్రికెటర్ బతికే ఉన్నారు!

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. జింబాబ్వే మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రీక్ చనిపోయారనే వార్తలు అవాస్తవం. ఆయన ప్రాణాలతోనే ఉన్నారు. ఈ విషయాన్ని హీత్ స్ట్రీక్ తోటి క్రికెటర్ హెన్రీ ఒలంగ వెల్లడించారు. కాగా ఉదయం హీత్ స్ట్రీక్ చనిపోయారనే వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కూడా ఒలంగానే కావడం గమనార్హం. నేడు ఉదయం తన ట్విట్టర్ ఖాతా ద్వారా హీత్ స్ట్రీక్ క్యాన్సర్‌తో చనిపోయారని ఒలంగ ఒక ట్వీట్ పెట్టారు. కానీ గంటల వ్యవధిలోనే మళ్లీ మాట మార్చారు. హీత్ స్ట్రీక్ బతికే ఉన్నారంటూ మరో ట్వీట్ చేశారు. హీత్ స్ట్రీక్‌తో చేసిన వాట్సాప్ చాట్‌ స్ర్కీన్ షాట్‌ను కూడా పోస్ట్ చేశారు. ‘‘హీత్ స్ట్రీక్ మరణానికి సంబంధించిన పుకార్లు చాలా అతిశయోక్తిగా ఉన్నాయని నేను ధృవీకరించగలను. నేను హీత్ స్ట్రీక్‌తో మాట్లాడాను. థర్డ్ అంపైర్ అతడిని వెనక్కి పిలిచాడు. ప్రస్తుతం హీత్ స్ట్రీక్ సజీవంగా ఉన్నారు.’’ అంటూ ఒలంగ ట్వీట్ చేశారు.


అయితే అప్పటికే హీత్ స్ట్రీక్ మరణించారనే వార్తలు వేగంగా వ్యాపించాయి. దీంతో అతని అభిమానులు, సహచరులు, క్రికెటర్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కానీ హీత్ స్ట్రీక్ బతికే ఉన్నారని ఒలంగ మరో ట్వీట్ చేయడంతో ఊపిరిపీల్చుకున్నారు. అయితే నేడు ఉదయం హీత్ స్ట్రీక్ చనిపోయడాని ట్వీట్ చేసిన ఒలంగపై పలువురు మండిపడుతున్నారు. నిజాన్ని తెలుసుకోకుండా అసత్యాన్ని ప్రసారం చేసిన ఒలంగపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతటి దిగ్గజ క్రికెటర్ గురించిన మరణ వార్త చెప్పే ముందు నిజ నిర్ధారణ చేసుకోవాలనే కనీసం ఇంకిత జ్ఞానం లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కాకపోతే హీత్ స్ట్రిక్ అనారోగ్యంతో పోరాడుతూ చికిత్స పొందుతున్నారని ఆయన కుటుంబసభ్యులు ఇప్పటికే పేర్కొంది. "హీత్‌కు క్యాన్సర్ ఉంది. దక్షిణాఫ్రికాలో చికిత్స పొందుతున్నారు" అని అతని కుటుంబం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇక తన 12 ఏళ్ల కెరీర్‌లో 65 టెస్టు మ్యాచ్‌లాడిన హీత్ స్ట్రీక్ 216 వికెట్లు పడగొట్టారు. బ్యాటింగ్‌లో 22 సగటుతో 1,990 పరుగులు చేశారు. ఇందులో ఓ సెంచరీ, 11 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోర్ 127గా ఉంది. ఇక 189 వన్డే మ్యాచ్‌లాడిన హీత్ స్ట్రీక్ 239 వికెట్లు తీశారు. బ్యాటింగ్‌లో 28 సగటుతో 2,943 పరుగులు చేశారు. ఇందులో 13 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోర్ 79గా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక హీత్ స్ట్రీక్ జింబాబ్వే, స్కాట్లాండ్, బంగ్లాదేశ్ జట్లకు కోచ్‌గా వ్యవహరించారు. ఐపీఎల్‌లో కూడా కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ లయన్స్ జట్లకు హీత్ స్ట్రీక్ కోచ్‌గా సేవలిందించారు. అయితే 2021లో అవినీతి నిరోధక ఉల్లంఘనల కారణంగా హీత్ స్ట్రీక్‌పై ఐసీసీ ఎనిమిదేళ్ల నిషేధం విధించింది.

Updated Date - 2023-08-23T13:19:58+05:30 IST