ICC rankings: టాప్‌లో గిల్, 12 స్థానాలు ఎగబాకిన కిషన్.. ర్యాంకింగ్స్‌లో మన కుర్రాళ్ల జోరు!
ABN , First Publish Date - 2023-09-06T15:22:48+05:30 IST
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ అదరగొట్టారు. బ్యాటింగ్ విభాగంలో భారత్ తరఫున గిల్ టాప్‌లో నిలవగా.. ఇషాన్ కిషన్ ఏకంగా 12 స్థానాలు ఎగబాకాడు.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ అదరగొట్టారు. బ్యాటింగ్ విభాగంలో భారత్ తరఫున గిల్ టాప్‌లో నిలవగా.. ఇషాన్ కిషన్ ఏకంగా 12 స్థానాలు ఎగబాకాడు. దీంతో ఈ సారి ర్యాంకింగ్స్‌లో మన కుర్రాళ్లు జోరు చూపించారు. ఆసియాకప్‌లో భాగంగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన గిల్.. ఒక స్థానం ఎగబాకి మూడో ర్యాంకుకు చేరుకున్నాడు. ప్రస్తుతం గిల్ ఖాతాలో 750 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. కాగా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత్ తరఫున అత్యుత్తమ ర్యాంకులో ఉన్నది గిలే కావడం గమనార్హం. అంతేకాకుండా గిల్ వన్డే కెరీర్‌లో కూడా ఇదే అత్యుత్తమ ర్యాంకు. ఆ తర్వాత టీమిండియా వెటరన్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వరుసగా 10, 11వ ర్యాంకుల్లో ఉన్నారు. కోహ్లీ ఒక స్థానం దిగజారి 9 నుంచి 10వ ర్యాంకుకు పడిపోగా.. రోహిత్ స్థానంలో ఎలాంటి మార్పు లేదు. ఇక పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్ ఏకంగా 12 స్థానాలు ఎగబాకి టాప్ 25లోకి చేరుకున్నాడు. ఖాతాలో 624 పరుగుల రేటింగ్ పాయింట్స్ కల్గి ఉన్న ఇషాన్ కిషన్ 36వ ర్యాంకు నుంచి 24వ ర్యాంకుకు ఎగబాకాడు. కాగా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ నాలుగో ర్యాంకు నుంచి ఎనిమిదో ర్యాంకుకు పడిపోయాడు. 652 రేటింగ్ పాయింట్స్ కల్గి ఉన్న సిరాజే భారత్ నుంచి టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా 10వ ర్యాంకు నుంచి 12వ ర్యాంకుకు పడిపోయాడు. కుల్దీప్ ఖాతాలో ప్రస్తుతం 614 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాడు జోష్ హేజిల్‌వుడ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆల్ రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా టాప్ 10లో ఉన్నాడు. పాకిస్థాన్‌పై 87 పరుగులతో చెలరేగిన హార్దిక్ 2 స్థానాలు ఎకబాకాడు. అతని ఖాతాలో 220 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆల్ రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ అల్ హాసన్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక అదే సమయంలో టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా రెండో ర్యాంకులో ఉన్నాడు. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ ఒక్కడే టాప్ 10లో కొనసాగుతున్నాడు.