IND vs WI: భారత్‌తో వన్డే సిరీస్‌‌కు విండీస్ జట్టులోకి ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు.. కానీ పూరన్‌పై వేటు!

ABN , First Publish Date - 2023-07-25T15:24:47+05:30 IST

ఈ నెల 27 నుంచి భారత్‌తో వన్డే సిరీస్ (India vs West Indies Odi Series) ప్రారంభంకానున్న నేపథ్యంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును ఎంపికచేసింది. 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసిన సెలెక్టర్లు స్టార్ ఆటగాడు నికోలస్ పూరన్‌పై వేటు వేశారు. కొంతకాలంగా పూరన్ ఫేలవ ఫామ్‌లో ఉన్నాడు.

IND vs WI: భారత్‌తో వన్డే సిరీస్‌‌కు విండీస్ జట్టులోకి ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు.. కానీ పూరన్‌పై వేటు!

ఈ నెల 27 నుంచి భారత్‌తో వన్డే సిరీస్ (India vs West Indies Odi Series) ప్రారంభంకానున్న నేపథ్యంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును ఎంపికచేసింది. 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసిన సెలెక్టర్లు స్టార్ ఆటగాడు నికోలస్ పూరన్‌పై వేటు వేశారు. కొంతకాలంగా పూరన్ ఫేలవ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫైయర్‌లోనూ విఫలమయ్యాడు. కాగా వెస్టిండీస్ జట్టు ఫేలవ ఆట తీరుతో భారత్ వేదికగా జరిగే వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించని సంగతి తెలిసిందే. అదే సమయంలో ప్రమాదకర ఆటగాళ్లైనా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ షిమ్రాన్ హెట్మెయర్, స్టార్ ఆల్‌రౌండర్ కైల్ మేయర్స్‌కు (Shimron Hetmyer and Kyle Mayers) వన్డే సిరీస్‌లో చోటు కల్పించింది. పేసర్ ఒషానె థామస్‌కు(Oshane Thomas) కూడా పిలుపు వచ్చింది.


దీంతో సంవత్సరం తర్వాత హెట్‌మేయర్ మళ్లీ విండీస్ వన్డే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. బిగ్ హిట్టర్ అయినా హెట్‌మేయర్ తన చివరి వన్డే మ్యాచ్‌ను 2021 జులైలో ఆడాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హెట్‌మేయర్ గత సీజన్‌లో రాణించాడు. 14 మ్యాచ్‌లో 300 పరుగులు చేశాడు. తన ఫినిషింగ్ నైపుణ్యంతో పలు మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌ను(Rajasthan Royals) గెలిపించాడు. ఇది కూడా హెట్‌మేయర్‌ రీఎంట్రీకి కలిసొచ్చింది. ఇక పేసర్ ఒషానె థామస్‌ విషయానికొస్తే మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ విండీస్ వన్డే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అతను తన చివరి వన్డే మ్యాచ్‌ను 2020 జనవరిలో ఆడాడు. టెస్టు సిరీస్‌లో రాణించిన అలిక్ అథనేజ్‌కు వన్డే సిరీస్‌లో కూడా చోటుదక్కింది. గత ఐపీఎల్‌లో(IPL 2023) అదరగొట్టిన కైల్ మేయర్స్‌ను వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. కాగా ఐపీఎల్‌లో మేయర్స్ లక్నోసూపర్ జెయింట్స్‌కు(Lucknow Super Giants) ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక జట్టుకు షాయ్ హోప్(Shai Hope) కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. రోవ్‌మన్ పావెల్(Rovman Powell) వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌కు 17 మందితో కూడిన భారత స్క్వాడ్‌ను సెలెక్టర్లు ఇప్పటికే ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇక భారత్, వెస్టిండీస్ మధ్య ఈ నెల 27, 29, ఆగష్టు 1వ తేదీల్లో మూడు వన్డేల సిరీస్ జరగనుంది.

వెస్టిండీస్ వన్డే స్క్వాడ్

షాయ్ హోప్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనాజ్, యానిక్ కరియా, కీసీ కార్టీ, డొమినిక్ డ్రేక్స్, షిమ్రాన్ హెట్‌మేయర్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, జేడెన్ సీల్స్, రొమారియో షెపర్డ్, కెవిన్ సింక్లెయిర్ మరియు కెవిన్ సింక్లెయిర్.

టీమిండియా వన్డే స్క్వాడ్

రోహిత్ శర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.

Updated Date - 2023-07-25T15:30:27+05:30 IST