IndiaVsAustralia: ఢిల్లీ టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ!.. ఇంకొకటి గెలిస్తే..

ABN , First Publish Date - 2023-02-19T14:20:38+05:30 IST

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో (border gavaskar trophy) భాగంగా ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో పర్యాటక జట్టు ఆసీస్‌పై 6 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది...

IndiaVsAustralia: ఢిల్లీ టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ!.. ఇంకొకటి గెలిస్తే..

ఢిల్లీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో (border gavaskar trophy) భాగంగా ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఆసీస్‌పై 6 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. 115 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 4 వికెట్లు నష్టపోయి విజయాన్ని సునాయాసంగా అందుకుంది. టార్గెట్ ఛేజింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (31), చతేశ్వర పుజార (31 నాటౌట్), శ్రీకర్ భరత్ (23 నాటౌట్) కీలక పాత్ర పోషించారు. ఒకపక్క వికెట్లు పడుతున్నా పుజార నిలకడగా ఆడి కడవరకు క్రీజులో ఉన్నాడు. ముఖ్యంగా తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్‌తో జతకలిసి చివరిలో విజయానికి అవసరమైన కీలక పరుగులు రాబట్టాడు.

కాగా ఈ విజయంతో సిరీస్‌లో భారత్ 2-0 ముందంజలో నిలిచింది. ఇంకో మ్యాచ్ గెలిస్తే సిరీస్ టీమిండియా సొంతమవుతుంది. మ్యాచ్ గెలవకపోయినా ఒక్క మ్యాచ్ డ్రా చేసుకున్నా సిరీస్ మనదే అవుతుంది. కాగా ఈ విజయంలో భారత్ స్పిన్నర్లు కీలకపాత్ర పోషించారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి రవీంద్ర జడేజా ఏకంగా 10 వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు తీశారు. దీంతో స్పిన్నర్లు మ్యాచ్‌ను తిప్పేసినట్టు అయ్యింది. 10 వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించిన రవీంద్ర జడేజాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డ్ దక్కింది. ఈ విజయంతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానానికి దూసుకెళ్లింది. దీంతో అన్నీ ఫార్మాట్లలోనూ ఇండియానే నంబర్ వన్‌గా నిలిచింది. ఇప్పటికే టీ20, వన్డే ఫార్మాట్‌లో అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే.

కాగా ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డ్‌ను సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వేగంగా 25 వేల పరుగుల అందుకున్న ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఢిల్లీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ 20 పరుగులు చేసి వెనుదిరిగిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-02-19T14:37:08+05:30 IST