IND vs AUS ODI: వైజాగ్ వన్డేలో టీమిండియా పరమ చెత్త బ్యాటింగ్..
ABN , First Publish Date - 2023-03-19T16:06:49+05:30 IST
ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 117 పరుగులకే ఆలౌట్ అయి చేతులెత్తేసింది. ఆసీస్ బౌలర్లు విజృంభించడంతో..
విశాఖ: రెండో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 117 పరుగులకే ఆలౌట్ అయి చేతులెత్తేసింది. ఆసీస్ బౌలర్లు విజృంభించడంతో 118 పరుగుల స్వల్ప టార్గెట్‌ను టీమిండియా నిలిపింది. 26 ఓవర్లకే టీమిండియా కుప్పకూలిపోవడంతో వైజాగ్ వన్డేను ఆసక్తిగా తిలకించేందుకు వచ్చిన అభిమానులను నిరాశ కమ్మేసింది. రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ బ్యాట్స్‌మెన్స్ కూడా 13, 31 పరుగుల వ్యక్తిగత స్కోర్లకే ఔట్ కావడం టీమిండియా అభిమానులను తీవ్ర నిరాశపరిచింది. శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ డకౌట్‌గా వెనుదిరిగారు. ఈ పరిణామం మరింత డీలా పడేలా చేసింది.
తొలి వన్డేలో అదరగొట్టి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన కేఎల్ రాహుల్ కూడా 9 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. హార్థిక్ పాండ్యా కూడా ఒక్క పరుగు మాత్రమే చేసి చేతులెత్తేశాడు. రవీంద్ర జడేజా 16 పరుగులకే ఔట్‌గా వెనుదిరిగాడు. టీమిండియా ఇంత చెత్తగా బ్యాటింగ్ చేయడంతో వైజాగ్ మ్యాచ్‌పై ఫుల్ క్రేజ్‌తో వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుందనుకుంటే ఉసూరుమనిపించడంతో అభిమానుల్లో నైరాశ్యం అలుముకుంది. ఆస్ట్రేలియా బౌలర్లు బెంబేలెత్తించారు. ముఖ్యంగా ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ 4 కీలక వికెట్లు పడగొట్టి టీమిండియాను గట్టి దెబ్బ కొట్టాడు. రోహిత్ శర్మ, గిల్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ వికెట్లను తీసి టీమిండియాను స్టార్క్ బెంబేలెత్తించాడు. చివర్లో మహ్మద్ సిరాజ్ వికెట్‌ను కూడా స్టార్క్ తీశాడు.
దీంతో.. ఈ ఆసీస్ బౌలర్ ఖాతాలో 5 వికెట్లు పడటం గమనార్హం. టీమిండియాలో సగం మందిని ఇతనే కూల్చేశాడు. అబాట్ కూడా 3 వికెట్లతో రాణించాడు. ఎల్లిస్‌కు రెండు వికెట్లు దక్కాయి. మొత్తంగా చూసుకుంటే.. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి టీమిండియా విలవిలలాడిపోయింది. అక్షర్ పటేల్ రెండు సిక్స్‌లతో జోష్ పెంచినా సిరాజ్ వికెట్ పడటంతో టీమిండియా 117 పరుగులకే ఆలౌట్‌గా వెనుదిరగక తప్పలేదు.