Sediqullah Atal: ఒకే ఓవర్‌లో 7 సిక్సులు.. 48 పరుగులు.. చరిత్ర సృష్టించిన ఆప్ఘనిస్థాన్ బ్యాటర్
ABN , First Publish Date - 2023-07-29T20:45:49+05:30 IST
కాబూల్ ప్రీమియర్ లీగ్‌లో(Kabul Premier League) ఆప్ఘనిస్థాన్ బ్యాటర్ సెడిఖుల్లా అటల్(Sediqullah Ata) చరిత్ర సృష్టించాడు. ఒకే ఓవర్‌లో ఏకంగా 7 సిక్సర్లు బాదేశాడు. దీంతో ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు బాదిన రెండో బ్యాటర్‌గా సెడిఖుల్లా రికార్డు నెలకొల్పాడు. సెడిఖుల్లా పెను విధ్వంసంతో స్పిన్నర్ అమీర్ జజాయ్ ఆ ఓవర్‌లో ఏకంగా 48 పరుగులు సమర్పించుకున్నాడు.
కాబూల్ ప్రీమియర్ లీగ్‌లో(Kabul Premier League) ఆప్ఘనిస్థాన్ బ్యాటర్ సెడిఖుల్లా అటల్(Sediqullah Ata) చరిత్ర సృష్టించాడు. ఒకే ఓవర్‌లో ఏకంగా 7 సిక్సర్లు బాదేశాడు. దీంతో ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు బాదిన రెండో బ్యాటర్‌గా సెడిఖుల్లా రికార్డు నెలకొల్పాడు. సెడిఖుల్లా పెను విధ్వంసంతో స్పిన్నర్ అమీర్ జజాయ్ ఆ ఓవర్‌లో ఏకంగా 48 పరుగులు సమర్పించుకున్నాడు. సిక్సర్ల వరద పారించడమే కాకుండా ఈ మ్యాచ్‌లో సెడిఖుల్ అజేయ సెంచరీతో విశ్వరూపం చూపించాడు. ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్‌లో కాబూల్ ప్రీమియర్ లీగ్ 2023(కేపీఎల్) జరుగుతుంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ లీగ్‌లో అబాసిన్ డిఫెండర్స్, షాకీన్ హంటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో షాకీన్ హంటర్స్ కెప్టెన్ సెడిఖుల్లా విశ్వరూపం చూపించాడు. షాహీన్ హంటర్స్(Shaheen Hunters) ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్‌ను అబాసిన డిఫెండర్స్ స్పిన్ బౌలర్ అమీర్ జజాయ్( Amir Zazai) వేశాడు.
లెఫ్ట్ హ్యాండ్ బ్యాటరైనా సెడిఖుల్లా ఆ ఓవర్ మొదటి బంతినే సిక్సర్ బాదాడు. అయితే అది నో బాల్ కావడంతో కౌంట్ కాకపోగా మరో ఎక్స్‌ట్రా పరుగు కూడా వచ్చింది. ఆ తర్వాతి బంతిని అమీర్ జజాయ్ వైడ్ వేయగా అది వికెట్ కీపర్‌కు అందకుండా ఫోర్ వెళ్లింది. దీంతో 19వ ఓవర్‌లో ఒక్క బంతి కూడా కౌంట్ కాకుండానే 12 పరుగులు వచ్చాయి. ఇక అమీర్ జజాయ్ వేసిన మిగిలిన 6 బంతులను సెడిఖుల్లా సిక్సర్లుగా మలిచాడు. దీంతో ఒకే ఓవర్‌లో 7 సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే సెడిఖుల్లా సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. అమీర్ జజాయ్ వేసిన ఆ ఓవర్‌లో ఏకంగా 48 పరుగులొచ్చాయి. దీంతో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌గా అమీర్ జజాయ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ ఓవర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో తన పూర్తి 4 ఓవర్ల కోటా బౌలింగ్ చేసిన జజాయ్ ఒక వికెట్ మాత్రమే తీసి ఏకంగా 79 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ మొత్తంలో 56 బంతులు ఎదుర్కొన్న సెడిఖుల్లా ఏకంగా 118 పరుగులు బాదేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 10 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. సెడిఖుల్లా విధ్వంసంతో షాహీన్ హంటర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 213 పరుగులు చేసింది. అనంతరం అబాసిన్ డిఫెండర్స్(Abasin Defenders) జట్టు 18.3 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. దీంతో షాహీన్ హంటర్స్ జట్టు ఏకంగా 92 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. కాగా సెడిఖుల్లా ఇటీవలనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. గత మార్చిలో పాకిస్థాన్‌తో ఓ టీ20 మ్యాచ్ ఆడాడు.
అయితే భారత యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు బాదాడు. విజయ్ హజారే ట్రోఫిలో ఈ రికార్డు సృష్టించాడు. ఆ ట్రోఫిలో ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన రుతురాజ్ గైక్వాడ్.. మహారాష్ట్ర బౌలర్ రుతురాజ్ శివసింగ్ వేసిన ఒకే ఓవర్‌లో 7 సిక్సులు బాదాడు. ఆ ఓవర్‌లో మొదటి బంతిని గైక్వాడ్ సిక్సు బాదాడు. కానీ అది నో బాల్ కావడంతో శివసింగ్ 6 బంతులు వేయాల్సి వచింది. వాటన్నింటిని రుతురాజ్ గైక్వాడ్ సిక్సర్లు బాదేశాడు. అప్పట్లో ఇది పెద్ద సంచలనంగా మారింది.