WPL UP vs Mumbai : ముంబై గెలుపు జోరు
ABN , First Publish Date - 2023-03-13T03:33:27+05:30 IST
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ వరుసగా నాలుగో మ్యాచ్‌లో నెగ్గి ప్లేఆఫ్స్ రేసులో దూసుకెళ్తోంది.
వరుసగా నాలుగో విజయం
యూపీకి రెండో ఓటమి
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ వరుసగా నాలుగో మ్యాచ్‌లో నెగ్గి ప్లేఆఫ్స్ రేసులో దూసుకెళ్తోంది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ హర్మన్‌ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 53 నాటౌట్) ధనాధన్ అర్ధ శతకంతో.. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 8 వికెట్లతో యూపీ వారియర్స్‌ను ఓడించింది. తొలుత యూపీ 20 ఓవర్లలో 159/6 స్కోరు చేసింది. అలిసా హీలీ (58), తాలియా మెక్‌గ్రాత్ (50) మూడో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు భారీ స్కోరు అందించేలా కనిపించారు. కానీ, 17వ ఓవర్‌లో బంతి తేడాతో హీలీ, మెక్‌గ్రాత్‌ను వెనక్కిపంపిన సైకా ఇషాక్ (3/33).. యూపీ జోరుకు కళ్లెం వేసింది. అమీలియా కెర్ 2 వికెట్లు తీసింది. ఓ మాదిరి లక్ష్యాన్ని ముంబై 17.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు హేలీ మాథ్యూస్ (12), యాస్తిక (42) ముంబైకు దీటైన ఆరంభాన్నే అందించారు.
తొలి ఓవర్‌లో మాథ్యూస్ రెండు బౌండ్రీలతో జోరు చూపగా.. రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకొన్న యాస్తిక బౌండ్రీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. అయితే, ఐదో ఓవర్‌లో ఎకిల్‌స్టన్ బౌలింగ్‌లో మాథ్యూస్ అవుట్ విషయంలో కొంత డ్రామా నడిచినా రెండుసార్లు సమీక్షించిన తర్వాత నాటౌట్‌గా ప్రకటించారు. తర్వాతి ఓవర్‌లో యాస్తిక 3 బౌండ్రీలతో విరుచుకుపడడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై 51/0తో నిలిచింది. అయితే, వరుసఓవర్లలో యాస్తిక, మాథ్యూస్ వెనుదిరిగినా.. నటాలి సివర్ (45 నాటౌట్), హర్మన్ మూడో వికెట్‌కు అభేద్యంగా 63 బంతుల్లో 106 పరుగుల భాగస్వామ్యంతో ముంబైని గెలిపించారు.
సంక్షిప్త స్కోర్లు:
యూపీ: 20 ఓవర్లలో 159/6 (హీలీ 58, మెక్‌గ్రాత్ 50, ఇషాక్ 3/33).
ముంబై: 17.3 ఓవర్లలో 164/2 (హర్మన్ 53 నాటౌట్, నటాలి 45 నాటౌట్).