21 ఏళ్ల క్రితం ఇదే రోజున చొక్కా విప్పి సంబరాలు చేసుకున్న గంగూలీ.. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే?..
ABN , First Publish Date - 2023-07-13T15:34:16+05:30 IST
సౌరవ్ గంగూలీ. ఈ పేరు వినగానే అతని అద్భుత నాయకత్వ ప్రతిభ అందరికీ గుర్తొస్తుంది. దీంతోపాటు క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్‌లో గంగూలీ చొక్కా విప్పి ఇంగ్లండ్‌కు గట్టి బుద్ది చెప్పిన ఘటనను ఎవరూ మరిచిపోలేరు. ఆ ఘటన ఎప్పుడూ గుర్తొచ్చిన భారత అభిమానులు ఉద్వేగానికి గురవుతంటారు. కాగా ఆ ఘటన జరిగిన నేటికి సరిగ్గా 21 ఏళ్లు పూర్తవుతుంది.
సౌరవ్ గంగూలీ. ఈ పేరు వినగానే అతని అద్భుత నాయకత్వ ప్రతిభ అందరికీ గుర్తొస్తుంది. దీంతోపాటు క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్‌లో గంగూలీ చొక్కా విప్పి ఇంగ్లండ్‌కు గట్టి బుద్ది చెప్పిన ఘటనను ఎవరూ మరిచిపోలేరు. ఆ ఘటన ఎప్పుడూ గుర్తొచ్చిన భారత అభిమానులు ఉద్వేగానికి గురవుతంటారు. కాగా ఆ ఘటన జరిగిన నేటికి సరిగ్గా 21 ఏళ్లు పూర్తవుతుంది.ఈ సందర్భంగా నాటి మధురానుస్మృతులతోపాటు అసలు ఆ రోజు గంగూలీ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఒకసారి గుర్తు చేసుకుందాం.
2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్లో భారత్, ఇంగ్లండ్ తలపడ్డాయి. 2002 జూలై 13న ఈ మ్యాచ్ జరిగింది. నాటి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. మార్కస్ ట్రెస్కోథిక్, నాజర్ హుస్సేన్ సెంచరీలతో చెలరేగారు. ఆ రోజుల్లో 270+ లక్ష్యచేధన అంటేనే భారీ లక్ష్యం. అలాంటిది 326 పరుగులు సాధించాలి అనే సరికి టీమిండియా ఓటమి ఖాయమనుకున్నారంతా.. కానీ గంగూలీ కెప్టెన్సీలోని నాటి భారత జట్టు చివరి వరకు పట్టుదలగా పోరాడింది. ఓపెనర్లు సెహ్వాగ్(45), గంగూలీ(60) మొదటి వికెట్‌కు సెంచరీ పాట్నర్‌షిప్ నెలకొల్పి బలమైన పునాది వేశారు. దీంతో 106-0తో టీమిండియా దీటుగా బదులిచ్చింది. అయితే ఇంతలోనే వరుసగా వికెట్లు కోల్పోవడంతో 146-5తో టీమిండియా కష్టాల్లో పడింది. దినేష్ మోంగియా(9), సచిన్ టెండూల్కర్ (14), రాహుల్ ద్రావిడ్ (5) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఇలాంటి సమయంలో నాటి జట్టులో కుర్రాళ్లైనా యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ అద్భుతం చేశారు. ఆరో వికెట్‌కు ఏకంగా 121 పరుగుల సెంచరీ పాట్నర్‌షిప్ నెలకొల్పారు. ఆ తర్వాత యువరాజ్ సింగ్(69) ఔటైనప్పటికీ, కైఫ్ మాత్రం చివరి వరకు పోరాడాడు. హర్భజన్ సింగ్‌తో కలిసి ఏడో వికెట్‌కు కైఫ్ 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత భజ్జీ, కుంబ్లే ఔటైనప్పటికీ కైఫ్ మాత్రం చివరి వరకు పోరాడి టీమిండియాకు 2 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో 87 పరుగులతో కైఫ్ నాటౌట్‌గా నిలిచాడు.
విజయం అనంతరం బాల్కనీలో ఉన్న కెప్టెన్ సౌరవ్ గంగూలీ చొక్కా విప్పి(టీమిండియా జెర్సీ) సంబరాలు చేసుకోవడం ఎవరూ మరిచిపోలేరు. చొక్కా విప్పి గిరగిర తిప్పుతూ ఎగిరిగంతేశాడు దాదా. అయితే గంగూలీ ఇలా చొక్కా విప్పి సంబరాలుచేసుకోవడానికి ఓ కారణం ఉంది. అంతకుముందు సరిగ్గా 5 నెలల క్రితం ముంబైలోని వాంఖడే మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. వన్డే సిరీస్‌లో భాగంగా రెండు జట్ల మధ్య అది ఆరో మ్యాచ్. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచింది. ఆ విజయం అనంతరం ఆ జట్టు ఆల్ రౌండర్ ఆండ్రు ఫ్లింటాఫ్ చొక్కా విప్పి సంబరాలు చేసుకున్నాడు. దీంతో దానికి బదులుగా గంగూలీ కూడా అచ్చం అలాగే లార్డ్స్‌లో చేశాడు. సరిగ్గా 5 నెలల్లోనే ప్లింటాప్ చేసిన దానికి గంగూలీ బదులు తీర్చుకోవడం గమనార్హం. ఈ విషయమపై గంగూలీని జెఫ్రీ బాయ్‌కాట్ ఓ సారి ప్రశ్నించాడు. 'లార్డ్స్ అంటే అంతర్జాతీయ క్రికెట్‌కు మక్కాలాంటిది కదా! చొక్కా విప్పొచ్చా? అని బాయ్‌కాట్ అడగ్గా.. వాంఖడే కూడా మాకు లార్డ్స్ లాంటిదే. ఫ్లింటాఫ్ అలా చేయొచ్చా' అని గంగూలీ సమాధానం ఇచ్చాడు. దాంతో బాయ్‌కాట్ మరోమాట మాట్లాడలేదు. మొత్తంగా ఆ దెబ్బతో టీమిండియా క్రికెటర్ల సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. మరోసారి ఇంగ్లండ్ ఆటగాళ్లే కాదు.. వేరే ఆటగాళ్లు కూడా ఎవరూ భారత్‌తో మ్యాచ్‌లో ఫ్లింటాప్ మాదిరగా ప్రవర్తించే ప్రయత్నం చేయలేదు.