Pragnananda: అదీ.. ప్రజ్ఞ
ABN , First Publish Date - 2023-08-22T03:00:22+05:30 IST
చెస్ వరల్డ్ కప్(Chess World Cup)లో భారత టీనేజ్ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద(Ramesh Babu Pragnananda) తన జోరు కొనసాగిస్తూ పైనల్‌కు దూసుకుపోయాడు.
చెస్ వరల్డ్ కప్ ఫైనల్లో ప్రజ్ఞానంద
ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానోకు షాక్
కార్ల్‌సన్‌తో టైటిల్ పోరు నేటినుంచే
ప్రత్యర్థి ఎవరైనా.. ప్రశాంతంగా ఆడుతూ.. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ.. తనదైన వ్యూహాలతో ప్రత్యర్థిని చిత్తు చేసే భారత చదరంగ చిచ్చరపిడుగు ప్రజ్ఞానంద మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. అసాధారణ ఆటతీరుతో అలరిస్తూ చెస్ ప్రపంచక్‌పలో ఫైనల్‌కు దూసుకుపోయి సంచలనం సృష్టించాడు. అగ్రశ్రేణి ఆటగాళ్లను ఓడించడం అలవాటుగా మార్చుకున్న ప్రజ్ఞానంద.. సెమీఫైనల్లో మూడోసీడ్ ఫాబియానో కరౌనాకు షాకిచ్చి ప్రపంచ నెంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌తో తుదిపోరుకు సిద్ధమయ్యాడు.
బాకు (అజర్‌బైజాన్): చెస్ వరల్డ్ కప్(Chess World Cup)లో భారత టీనేజ్ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద(Ramesh Babu Pragnananda) తన జోరు కొనసాగిస్తూ పైనల్‌కు దూసుకుపోయాడు. హోరాహోరీగా జరిగిన సెమీఫైనల్‌లో టైబ్రేకర్ ద్వారా వరల్డ్ నె.3 ఫాబియానో కరౌనాను 3.5-2.5 పాయింట్ల ఆధిక్యంతో ప్రజ్ఞానంద కంగుతినిపించాడు. మంగళవారం ప్రారంభమయ్యే ఫైనల్లో వరల్డ్ నెం.1 మాగ్నస్ కార్ల్‌సన్(Magnus Carlson)తో ఈ చెన్నై కుర్రాడు అమీతుమీ తేల్చుకుంటాడు. 31 ఏళ్ల అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ కరౌనాతో సెమీస్ తొలి రెండు క్లాసికల్ గేమ్‌లూ డ్రా కావడంతో పోరు టైబ్రేకర్‌కు మళ్లిన సంగతి తెలిసిందే. దాంతో సోమవారంనాటి టైబ్రేకర్‌లో మొదటి రెండు ర్యాపిడ్ గేమ్‌లలోనూ ఫలితం తేలలేదు. కానీ మూడో టై బ్రేకర్‌లో నల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద 63 ఎత్తుల్లో కరౌనాను చిత్తు చేయడం ద్వారా తుదిపోరులో స్థానం దాదాపు ఖాయం చేసుకున్నాడు. ఇక తదుపరి గేమ్‌ను డ్రా చేసుకొంటే భారత స్టార్‌కు ఫైనల్ బెర్త్ ఖాయమే. కానీ అనుభవజ్ఞుడైన కరౌనా పట్టువీడలేదు. దాంతో నాలుగో గేమ్‌లో ఉత్కంఠ పెరిగిపోయింది. అయితే గేమ్ 82 ఎత్తుల తర్వాత కరౌనా డ్రాకు అంగీకరించక తప్పలేదు. ఫలితంగా ప్రజ్ఞానంద జయకేతనం ఎగురవేశాడు.
క్వార్టర్స్‌లో సహచరుడు అర్జున్‌తో 8 గేమ్‌లలోనూ ఫలితం తేలకపోవడంతో.. ఆ పోరు సడన్ డెత్‌కు వెళ్లింది. అందులో గెలవడం..కరౌనాతో సెమీఫైనల్ టైబ్రేకర్‌లో ప్రజ్ఞానందకు ఆత్మవిశ్వాసం ఇచ్చింది. ఈ టోర్నీ సమయంలోనే 18వ ఏట ప్రవేశించిన ప్రజ్ఞానంద ఫైనల్‌కు చేరే క్రమంలో రెండో సీడ్ హికారు నకమురాను కూడా ఓడించడం గమనార్హం. 2005 నుంచి వరల్డ్ కప్‌ను నాకౌట్ ఫార్మాట్‌లో నిర్వహిస్తుండగా..అప్పటినుంచి ఫైనల్‌కు చేరిన తొలి భారత ఆటగాడు ప్రజ్ఞానందదే కావడం విశేషం. 2000, 2002లో విశ్వనాథన్ ఆనంద్ రెండుసార్లు వరల్డ్ కప్ విజేతగా నిలిచినా..అప్పట్లో 24 మంది ఆటగాళ్లు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఆడేవారు. క్యాండిడేట్స్ చెస్‌కు ఇప్పటికే అర్హత సాధించిన ప్రజ్ఞానంద..బాబీ ఫిషర్, కార్ల్‌సన్ తర్వాత ఆ టోర్నీకి క్వాలిఫై అయిన పిన్నవయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.
కాచుకో.. కార్ల్‌సన్
సమకాలీన చెస్‌లో గొప్ప ఆటగాడైన కార్ల్‌సన్‌పై ప్రజ్ఞా నంద ఇప్పటిదాకా మూడు సార్లు విజయం సాధించడం విశేషం. 2016లో ప్రజ్ఞానంద 10 ఏళ్ల వయసులోనే తొలిసారి మాగ్నస్‌కు షాకిచ్చాడు. 2018లో ఓ ర్యాపిడ్ టోర్నీలో రెండోసారి ఓడించాడు. గత ఏడాది ఆగస్టులో క్రిప్టో కప్ ఫైనల్లో ముచ్చటగా మూడోసారి నార్వే దిగ్గజానికి చెక్ పెట్టాడు. మరి.. మంగళవారం నుంచి ప్రపంచకప్ ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించి చరిత్ర సృష్టిస్తాడేమో చూడాలి.
మహిళల విజేత గోర్యాచ్కినా
మహిళల విభాగంలో రష్యా జీఎం అలెగ్జాండ్రా గోర్యాచ్కినా విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆమె బల్గేరియాకు చెందిన ఇంటర్నేష నల్ మాస్టర్ నుగ్యుల్ సలిమో వాను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది.