Share News

Virat Kohli: ఒక అర్థశతకంతో రెండు రికార్డులు ఔట్.. విరాట్ కోహ్లీతో మామూలుగా ఉండదు మరి!

ABN , First Publish Date - 2023-11-12T17:42:52+05:30 IST

IND vs NED: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని రికార్డుల రారాజు అని పిలుస్తుంటారు. ఎందుకంటే.. అతడు బద్దలుకొట్టని, సృష్టించలేని రికార్డులంటూ ఏవీ లేవు. అసలు కోహ్లీ రికార్డులు చేయడం అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది.

Virat Kohli: ఒక అర్థశతకంతో రెండు రికార్డులు ఔట్.. విరాట్ కోహ్లీతో మామూలుగా ఉండదు మరి!

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని రికార్డుల రారాజు అని పిలుస్తుంటారు. ఎందుకంటే.. అతడు బద్దలుకొట్టని, సృష్టించలేని రికార్డులంటూ ఏవీ లేవు. అసలు కోహ్లీ రికార్డులు చేయడం అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. రీసెంట్‌గానే.. క్రికెట్ చరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కాదనుకున్న సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల (వన్డేల్లో) రికార్డ్‌ని సమం చేసి చరిత్ర సృష్టించాడు. లేటెస్ట్‌గా.. వరల్డ్‌కప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అర్థశతకం బాది, ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు రెండు రికార్డులను నమోదు చేశాడు.

మొదటిది.. ఈ వరల్డ్ కప్ మెగాటోర్నీలో లీగ్ దశలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీలో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 594 పరుగులు చేశాడు. వాటిల్లో నాలుగు అర్థశతకాలు, రెండు శతకాలు ఉన్నాయి. 600 పరుగుల మైలురాయికి అతడు 6 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌కి ముందు క్వింటన్ డీ కాక్ 591 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్‌గా ఉండేవాడు. కానీ.. కోహ్లీ నెదర్లాండ్స్ మ్యాచ్‌లో అర్థశతకం (51) చేసి, డీకాక్‌ను వెనక్కు నెట్టేసి అగ్రస్థానంలోకి వచ్చేశాడు. 54 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ సహకారంతో కోహ్లీ ఆ అర్థశతకాన్ని నమోదు చేశాడు.

ఇక రెండో రికార్డ్ ఏమిటంటే.. ఈ మెగాటోర్నీలో కోహ్లీ మొత్తం ఏడు సార్లు 50+ వ్యక్తిగత స్కోరు చేశాడు. దీంతో.. వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక సార్లు 50+ స్కోర్ చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ని సమం చేశాడు. 2003 వరల్డ్ కప్‌లో సచిన్ టెండూల్కర్ మొత్తం ఏడు సార్లు 50+ స్కోర్ చేశాడు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత వరల్డ్‌ కప్ 2023లో ఆ రికార్డ్‌ని కోహ్లీ సమం చేయడం విశేషం. షకీబ్ అల్ హసన్ కూడా 2019 వరల్డ్‌కప్‌లో 7 సార్లు 50+ స్కోర్ నమోదు చేశాడు. టీమిండియా సెమీస్‌కి వెళ్లింది కాబట్టి.. కోహ్లీ మరో 50+ స్కోర్ చేస్తే, వరల్డ్‌కపో‌లో అత్యధిక 50+ స్కోర్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.

Updated Date - 2023-11-12T17:42:54+05:30 IST