DH srinivasarao: కొత్తగూడెంలో కొత్త తరం రాజకీయాల్లోకి రావాలి: డీహెచ్
ABN , First Publish Date - 2023-04-09T16:54:01+05:30 IST
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు (Telangana Health Director Srinivas) పొలిటికల్ ఎంట్రీ కోసం తహతహలాడుతున్నారు.
భద్రాద్రి: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు (Telangana Health Director Srinivas) పొలిటికల్ ఎంట్రీ కోసం తహతహలాడుతున్నారు. ఆయన ప్రభుత్వ అధికారిననే సంగతే మరిచిపోయారు. వృత్తిపరమైన అంశాలకంటే.. రాయకీయాలపైనే ఆయన మక్కువ చూపిస్తూ ఉంటారు. రాజకీయాల గురించి మాట్లాడుతూ ఆయన ఎన్నోసార్లు విమర్శలపాలయ్యారు. అయినా తగ్గేదేలే అన్నట్లు ఉంటారాయన. తాజాగా కొత్తగూడెం (Kothagudem) గడ్డ ఉద్యమాలకు అడ్డా అని కొనియాడారు. కొత్తగూడెంలో కొత్త తరం రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా ఒక్కరే రాజకీయాలు అనుభవిస్తున్నారని విమర్శించారు. కొత్తవారికి అవకాశం ఇవ్వరా?.. మిగతావారు నాయకులు కాకూడదా? అని డీహెచ్ శ్రీనివాస్‌రావు ప్రశ్నించారు.
వాస్తానికి శ్రీనివాసరావు కొత్తగూడెనికి చెందినవారు. చాలా కాలంగా డీహెచ్ రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతున్నారు. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కొత్తగూడెం సీటు నుండి పోటీకి ఆరాటపడుతున్న డీహెచ్ (Director of Health).. నియోజకవర్గం కేంద్రంగా తనకంటూ బీఆర్ఎస్‌లో (BRS) ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌లో చేరాలని భావిస్తున్నారని పలు రిపోర్టులు వెలువడ్డాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసి ఇప్పటికే తన కోరికను వ్యక్తం చేసినట్టుగా కొంతకాలం ప్రచారం నడిచింది. అయితే కేసీఆర్ ఆమోదం లభిస్తే వీఆర్‌ఎస్ తీసుకొని రాజకీయ అరంగేట్రం చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి.
అవకాశం దొరికిన ప్రతీ సందర్భంలోనూ శ్రీనివాసరావు స్వామి భక్తిని చాటుకున్నారు. అప్పట్లో సీఎం కేసీఆర్ (CM KCR) కాళ్లు మొక్కిన వీడియో వైరల్ కావడం, విమర్శలు రావడం తెలిసిందే. అయితే విమర్శలకు స్పందిస్తూ.. కేసీఆర్ కాళ్లు మొక్కడాన్ని ఆయన సమర్థించుకోవడం కొసమెరుపు. ఒక్కసారి కాదని వందసార్లైనా బరాబర్ మొక్కుతానని ప్రకటించారు. శ్రీనివాసరావు పొలిటికల్ ఎంట్రీ ఏమో తెలియదు గానీ.. ఆయన వ్యాఖ్యల వల్ల వివాదాల్లో చిక్కుకుంటూ అప్రతిష్టపాలవుతున్నారు.