Revanth Reddy: తెలంగాణ ఇచ్చినట్లే 6 గ్యారంటీలు అమలు చేస్తాం
ABN , First Publish Date - 2023-11-11T14:51:04+05:30 IST
చెన్నూరు ఎమ్మెల్యేకు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి..?, సింగరేణి ఉద్యోగాలు, భూములు అమ్ముకోలేదా?, అలాంటి వారినా కేసీఆర్ గెలిపించాలనేది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాం.
మంచిర్యాల: తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినట్లే అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. బెల్లంపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రేవంత్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘‘దేశంలో గాంధీ కుటుంబంలా.. తెలంగాణలో వెంకటస్వామి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి పట్టాదారులు. ఇటు బెల్లంపల్లిలో అటు చెన్నూరులో కాంగ్రెస్ జెండా ఎగరేయాలి. తుమ్మిడిహట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ (Cm kcr) మెడిగడ్డకు తీసుకెళ్లారు. మేడిగడ్డ కుంగిపోయింది.. అన్నారం మిగిలిపోయింది. సీఎం కేసీఆర్ కట్టిన కాళేశ్వరం వాన వస్తేనే కుంగిపోయింది. అంత పెద్ద ప్రాజెక్టును ఇసుక మీద ఎవరైనా కడతారా?. అదేమైనా పేక మేడనా?, ఇసుకపై బ్యారేజీ కడితే అది కుంగిపోయింది. మేడిగడ్డ అణా పైసాకు పనికిరాదు.. అన్నారం అక్కరకు రాదు. బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య దుర్మార్గాల గురించి రాష్ట్రమే కాదు... దేశమంతా తెలుసు. అలాంటి దుర్మార్గుడిని గెలిపించాలని కేసీఆర్ చెబుతున్నారు.’’ అని ధ్వజమెత్తారు.
‘‘చెన్నూరు ఎమ్మెల్యేకు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి..?, సింగరేణి ఉద్యోగాలు, భూములు అమ్ముకోలేదా?, అలాంటి వారినా కేసీఆర్ గెలిపించాలనేది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాం. ఆదిలాబాద్ ఆత్మగౌరవం పెరగాలంటే గడ్డం వినోద్, వివేక్‌లను అత్యధిక మెజారిటీతో గెలిపించండి. కాంగ్రెస్ కార్యకర్తలపై (Congress) పెట్టిన అక్రమ కేసులను ఒక్క కలం పోటుతో తొలగిస్తాం. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని కేసీఆర్ అంటున్నారు. ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ పేటెంట్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చి తీరుతాం. ధరణి తీసేస్తే రైతు బంధు రాదని కేసీఆర్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ధరణి రాకముందు 2018లో రైతు బంధు ఎలా ఇచ్చారు?, ధరణికంటే మెరుగైన సాంకేతికతను కాంగ్రెస్ తీసుకొస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు భరోసా ద్వారా రైతులకు ప్రతీ ఎకరానికి ఏటా రూ.15వేలు అందిస్తాం. రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12వేలు అందిస్తాం. మాట తప్పని, మడమ తిప్పని ఉక్కు మహిళ సోనియా. ఇచ్చిన మాట ప్రకారం సోనియా తెలంగాణ ఇచ్చారు.’’ అని రేవంత్ వివరించారు.