IIIT Students: బాసర ట్రిపుల్ ఐటీలో వరుస ఆత్మహత్యలు.. విద్యార్థినిల్లో కలకలం... అసలేం జరుగుతోంది?
ABN , First Publish Date - 2023-06-15T09:52:07+05:30 IST
బాసర ట్రిపుల్ ఐటీలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ట్రిపుల్ ఐటీలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న దీపిక రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న వార్త మరువక ముందే తాజాగా మరో విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. బూర లిఖిత అనే విద్యార్థిని గత అర్ధరాత్రి హాస్టల్ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది.
నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీలో (Basara IIIT) వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ట్రిపుల్ ఐటీలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న దీపిక రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న వార్త మరువక ముందే తాజాగా మరో విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. బూర లిఖిత అనే విద్యార్థిని గత అర్ధరాత్రి హాస్టల్ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. నాలుగో అంతస్తు నుంచి దూకడంతో లిఖిత అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు పీయూసీ మొదటి సంవత్సరం చదువుతోంది. లిఖిత స్వస్థలం సిద్ధిపేట జిల్లా గజ్వేల్. విషయం తెలిసిన ట్రిపుల్ ఐటీ సిబ్బంది లిఖిత మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని విగతజీవిగా పడి ఉన్న తమ కూతురిని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు వరుస ఆత్మహత్యల నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. మీడియా సహా ఎవరినీ కూడా లోపలికి అనుమతించేందుకు నిరాకరిస్తున్నారు. అయితే మొన్న దీపిక.. ఇప్పుడు లిఖిత ఆత్మహత్యలతో అసలు క్యాంపెస్‌లో ఏం జరుగుతుందో అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ట్రిపుల్ ఐటీలో విద్యార్థినిల ఆత్మహత్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
వీసీ రియాక్షన్..
ట్రిపుల్ ఐటీ విద్యార్థిని లిఖిత మృతిపై వీసీ వెంకటరమణ స్పందించారు. లిఖిత ప్రమాదవశాత్తు చనిపోయినట్టు భావిస్తున్నామన్నారు. ఫోన్ చూస్తూ భవనంపై నుంచి జారి పడిందని.. ప్రమాదంలో ఆమె వెన్ను భాగం దెబ్బతిన్నదని తెలిపారు. విద్యార్థుల మరణం బాధాకరమని వీసి వెంకటరమణ అన్నారు. మరోవైపు జిల్లా ఆసుపత్రి కి చేరుకున్న ట్రిపుల్ ఐటీ వీసీ.. విద్యార్థిని లిఖిత మృతదేహాన్ని పరిశీలించారు. అయితే ఆస్పత్రికి వచ్చిన వీసీని... లిఖిత కుటుంబసభ్యులు నిలదీశారు. మీ నిర్లక్ష్యం వల్లనే పిల్లలు చనిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
జిల్లా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించేందుకు ఆస్పత్రికి వచ్చిన వీసి వెంకటరమణను కాంగ్రెస్ నేతలు ఘెరావ్ చేశారు. వీసీతో వాగ్వాదానికి దిగుతూ.. వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వీసీ వెంకటరమణ కాసేపటికే ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు.
రెండు రోజుల క్రితం కూడా...
కాగా.. రెండు రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా వడ్లపల్లి మండలం గొర్రెకల్ గ్రామానికి చెందిన వడ్ల దీపిక (17) ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీపిక ట్రిపుల్ ఐటీలో పీయూసీ (ప్రీ యూనివర్సిటీ కోర్సు) మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవలే వేసవి సెలవులు ముగియడంతో దీపిక యూనివర్సిటీకి వచ్చింది. చివరి సెమిస్టర్ పరీక్షలు జరుగుతుండడంతో మంగళవారం పరీక్షకు హాజరైంది. పరీక్ష రాసిన తర్వాత అదే సెంటర్‌లోని బాత్‌రూమ్ గదిలోకి వెళ్లి తన చున్నీతో ఉరివేసుకుంది. ఎంతకూ తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన తొటి విద్యార్థినులు అధ్యాపకులకు సమాచారం అందించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది వచ్చి బాత్రూం తలుపు తొలగించారు. అచేతన స్థితిలో ఉన్న దీపికను హుటాహుటిన జిల్లాలోని భైంసా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అయితే దీపిక ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. దీంతో యూనివర్సిటీ అధికారులు ఆత్మహత్యకు గల కారణాలను నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. వర్సిటీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బాసర పోలీసులు తెలిపారు.