BRS: బీఆర్‌ఎస్‌లో చేరిన ఏపీ నేతలు
ABN , First Publish Date - 2023-01-02T20:21:14+05:30 IST
జాతీయ పార్టీగా దేశ వ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాల్లో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) తొలుత పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో తమ శాఖను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయింది.
హైదరాబాద్: జాతీయ పార్టీగా దేశ వ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాల్లో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) తొలుత పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో తమ శాఖను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయింది. ఏపీలోని ప్రధాన పార్టీలకు చెందిన కొందరు నేతలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకుంది. బీఆర్‌ఎస్ (BRS)లో ఏపీ నేతలు చేరారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ (Thota chandrasekhar), మాజీమంత్రి రావెల కిషోర్, పార్థసారథి, టీజే ప్రకాష్, రమేష్‌నాయుడు, గిద్దల శ్రీనివాస్, జేటీ రామారావులకు కండువా కప్పి పార్టీలోకి సీఎం కేసీఆర్ (CM KCR) ఆహ్వానించారు. తోట చంద్రశేఖర్‌ను ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రకటించనున్నారు. ఆ వెంటనే ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేలా తగిన ఏర్పాట్లు చేశారు. తోట చంద్రశేఖర్‌ను బీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం ద్వారా ఏపీలో బలంగా ఉన్న కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకును ప్రభావితం చేసేలా కేసీఆర్ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. చంద్రశేఖర్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడయితే.. కాపుల్లో కొందరు బీఆర్‌ఎస్ వైపునకు ఆకర్షితులవుతారని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. తోట చంద్రశేఖర్ ప్రజారాజ్యం పార్టీ (Praja Rajyam Party) తరఫున 2009లో గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014లో ఏలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. అనంతరం జనసేనలో చేరారు. 2019 ఎన్నికల్లో జనసేన (Janasena) తరఫున గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసినా.. అక్కడా ఆయనకు ఫలితం దక్కలేదు. ఇప్పుడు చంద్రశేఖర్ బీఆర్‌ఎస్‌లో చేరడం విశేషం.