CEO Vikasraj: తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం
ABN , First Publish Date - 2023-11-20T22:54:31+05:30 IST
తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని సీఈఓ వికాస్‌రాజ్ ( CEO Vikasraj ) తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని సీఈఓ వికాస్‌రాజ్ ( CEO Vikasraj ) తెలిపారు. సోమవారం నాడు వికాస్‌రాజ్ ఏబీఎన్‌తో మాట్లాడుతూ...‘‘ 30వ తేదీన ఎన్నికలు , డిసెంబర్ 3వ తేదీన ఫలితాల కోసం సర్వం సిద్ధం అయింది. 297 కేంద్ర బలగాలతో పాటు యాబై వేల మంది స్టేట్ పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశాము. అయిన్నప్పటికి అక్కడక్కడ ఉద్రికత్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈసీ కార్యాలయంలో మానిటరింగ్ సిస్టం ద్వారా పర్యవేక్షణ ఉంది. 600 కోట్లకు పైగా మద్యం , డబ్బు , ఆర్నమెంట్స్‌ను సీజ్ చేశాము. ఇందులో రాజకీయ పార్టీలకు చెందిన వారితో పాటు సరిగా ఇన్వైస్ చూపని వారికి సంబంధించిన వాటిని సీజ్ చేశాము. షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి రెగ్యులర్‌గా ఉన్నతాధికారుల పనితీరుపై మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. వచ్చిన ప్రతి ఫిర్యాదును ఈసీఐకి పంపిస్తున్నాం. ప్రతి పోలింగ్ సెంటర్‌లో అత్యధునిక టెక్నాలజీతో మానిటరింగ్ ఉంటుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు నిఘా ఉంచాము. అక్కడ పోలింగ్ నిర్వహణపై ఉన్నతాధికారుల స్పెషల్ మానిటరింగ్ ఉంటుంది. రైతుబంధు , రుణమాఫీ , ఉద్యోగుల డీఏకు సంబంధించి స్టేట్ గవర్నమెంట్ ఈసీని సంప్రదించింది. ఇందులో కొన్ని ఈసీఐకి పంపాము. ఇంకా కొన్ని ప్రాసెస్‌లో ఉన్నాయి. ఓటర్లు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి’’ అని సీఈఓ వికాస్‌రాజ్ పేర్కొన్నారు.