CM KCR : ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓట్లు వేయాలి
ABN , First Publish Date - 2023-10-29T16:46:23+05:30 IST
ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓట్లు వేయాలని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. ఆదివారం నాడు తిరుమలగిరిలో BRS ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు.
తుంగతుర్తి: ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓట్లు వేయాలని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. ఆదివారం నాడు తిరుమలగిరిలో BRS ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సభలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అన్ని పార్టీల వైఖరి, చరిత్ర ప్రజలకు తెలుసు. గతంలో తుంగతుర్తి నుంచి వలసలు చూసి కన్నీళ్లు వచ్చేవి. గోదావరి జలాలను పట్టుబట్టి తుంగతుర్తికి తెచ్చుకున్నాం. ఇప్పుడు తుంగతుర్తిని చూస్తే ఎంతో సంతృప్తి కలుగుతోంది. గతంలో ఎవరైనా తెలంగాణ గురించి మాట్లాడితే..నక్సలైట్లు అని జైలులో వేసేవారు. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని...ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నా. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించాను. నాడు ఉద్యమంలో కనపడని వాళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నారు. నేను సభల్లో చెప్పిన విషయాలపై గ్రామాల్లో చర్చ పెట్టండి. తెలంగాణ రాకముందు వలసలు, ఆకలిచావులు ఉండేవి. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో భూగర్భజలాలు పెరిగాయి. యూపీలో ప్రజలకు అన్నానికి దిక్కులేదు. అక్కడి సీఎం ఇక్కడకు వచ్చి పాఠాలు చెబుతున్నారు. అల్ట్రా పవర్‌ప్లాంట్‌ను దామరచర్లలో ఏర్పాటు చేస్తాం. గాదరి కిశోర్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో తుంగతుర్తి ప్రజలు గెలిపించాలి. ఉద్యమ సమయంలో గాదరి కిశోర్ జైలుకు కూడా వెళ్లారు’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.