TS Assembly Polls : తెలంగాణ ఎన్నికలపై సంచలన సర్వే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లని తేలిందంటే..!?
ABN , First Publish Date - 2023-11-01T14:30:07+05:30 IST
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఓటర్లు ఎటువైపు ఉన్నారో తెలియక.. వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రచారంలో చేయాల్సినవన్నీ చేస్తున్నారు. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఓటర్లు ఎటువైపు ఉన్నారో తెలియక.. వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రచారంలో చేయాల్సినవన్నీ చేస్తున్నారు. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే.. దాన్ని సువర్ణావకాశంగా మలుచుకుని అభ్యర్థులు ముందుకెళ్తున్నారు. మరోవైపు.. తెలంగాణ ప్రజలు ఎవరివైపు ఉన్నారు..? బీఆర్ఎస్ పార్టీని ముచ్చటగా మూడోసారి అధికారంలో కొనసాగనిస్తారా..? లేకుంటే కాంగ్రెస్‌కు పట్టం కడతారా..? ఈ రెండింటినీ కాదని బీజేపీకి పగ్గాలిస్తారా..? అనేది తెలియట్లేదు. వాస్తవానికి 2018 ఎన్నికల్లో ఈ పాటికే దాదాపు క్లియర్ కట్‌గా గెలుపు ఎవరిదో తేలిపోయింది కానీ.. ఈ సారి మాత్రం ప్రముఖ సర్వే సంస్థలకు సైతం అంతుచిక్కట్లేదు. పైగా కొన్ని సర్వేల్లో కాంగ్రెస్‌దే అధికారమని.. ఇంకొన్ని సర్వేల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతోందని తేలిపోయింది.
సర్వే ఎలా చేశారు..?
ఇప్పటికే జాతీయ మీడియా సంస్థలైన ఇండియా టుడే, ఇండియా టీవీలు సర్వేలు చేసి ఫలితాలను వెల్లడించాయి. తాజాగా.. తెలంగాణ ఎన్నికలపై మరో ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ ‘జనతా కా మూడ్’ సర్వే సంచలన ఫలితాలను ప్రకటించింది. బుధవారం నాడు ఈ సర్వే ఫలితాలను ఢిల్లీ వేదికగా జనతా కా మూడ్ వ్యవస్థాపకులు భాస్కర్ సింగ్ విడుదల చేశారు. సర్వేలో భాగంగా పెద్ద ఎత్తున డేటా సేకరించడంతోపాటు.. లోతైన విశ్లేషణ చేసామని తెలంగాణ ఎన్నికల్లో అనేక కీలక అంశాలు ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం లక్షా 20 వేల శాంపిల్స్ తీసుకొని.. రెండు నెలలపాటు సర్వే చేశామని ప్రతినిధులు స్పష్టం చేశారు.సెప్టెంబర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు శాంపిల్స్ తీసుకోవడంతో పాటు లోతైన విశ్లేషణ చేసి తాము ఈ అంచనాకు వచ్చామని సంస్థ ప్రతినిధులు మీడియాకు తెలిపారు.
ఎవరికెన్ని సీట్లు :-
బీఆర్ఎస్ : 72 నుంచి 75 వరకు
కాంగ్రెస్ : 31 నుంచి 36 వరకు
బీజేపీ : 04 నుంచి 06 స్థానాల వరకు
ఎంఐఎం : 06 నుంచి 07 స్థానాల వరకు
ఇతరులు : 00 స్థానాలు
ఏ పార్టీకి ఎంత శాతం :-
బీఆర్ఎస్ : 41 శాతం
కాంగ్రెస్ : 34 శాతం
బీజేపీ : 14 శాతం
ఎంఐఎం : 3 శాతం
ఇతరులు : 8 శాతం
మొత్తానికి చూస్తే.. తెలంగాణలో బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్యే పోటి అని తేలిపోయింది. గతంలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సర్వేలు నిర్వహించి ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ వివరాలను జనతా కా మూడ్ వెల్లడించింది. కాగా.. 2015లో ఢిల్లీ, బీహార్ ఎన్నికలు.. 2016లో అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి ఎన్నికలు.. 2017లో పంజాబ్ ఎన్నికలకు ఈ సర్వే సంస్థ చెప్పినట్లుగానే.. ఇంచుమించు దగ్గరగానే ఫలితాలు వచ్చాయని జనతా కా మూడ్ వెల్లడించారు. అయితే ఈ సర్వేపై మంత్రి హరీష్ రావు స్పందిస్తూ.. అన్ని సర్వేలు బీ ఆర్ఎస్ గెలుపు ఖాయం అంటున్నాయన్నారు.