Telangana Election: కేసీఆర్ నాన్ లోకల్!.. ‘స్థానిక’ సెంటిమెంటుతో అభ్యర్థుల విస్తృత ప్రచారం
ABN , First Publish Date - 2023-11-23T03:41:19+05:30 IST
నేను ఇక్కడే పుట్టిన.. ఇక్కడే పెరిగిన.. నా కట్టె కాలేవరకూ మీతోనే ఉంటా.
పలు నియోజకవర్గాల్లో స్థానిక, స్థానికేతర రగడ
కామారెడ్డి సహా అనేక చోట్ల ప్రత్యర్థుల అస్త్రం
వాళ్లు నాన్ లోకల్.. ఓట్లు వేయొద్దు
ఎన్నికలప్పుడే కనిపించే బ్యాచ్ అది
ఆ తర్వాత చూద్దామన్నా దొరకరు
నేను మీతోనే.. మీ మధ్యే ఉంటాను
నాకే ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించండి
‘స్థానిక’ సెంటిమెంటుతో అభ్యర్థుల విస్తృత ప్రచారం
తెలంగాణలో సీఎం కేసీఆర్ నాన్ లోకల్ అవుతారని మీరెప్పుడైనా ఊహించారా? అవును.. కామారెడ్డికి ఆయన స్థానికేతరుడేనని బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు! అంతేనా.. పీసీసీ చీఫ్ రేవంత్ కూడా నాన్ లోకలేనంటూ ప్రజలకు పదేపదే గుర్తు చేస్తున్నారు. కాబట్టి కామారెడ్డిలోని యావత్ప్రజానీకం స్థానికుడినైన తనకే ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయనొక్కరే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా పలు పార్టీల అభ్యర్థులు.. ఇలా తమ ప్రత్యర్థులపై ‘స్థానిక’ అస్త్రాన్ని ఎక్కుపెడుతున్నారు.
‘‘నేను ఇక్కడే పుట్టిన.. ఇక్కడే పెరిగిన.. నా కట్టె కాలేవరకూ మీతోనే ఉంటా. ఈ మట్టిలోనే కలిసిపోతా! మీరే నా కుటుంబం. నా భవిష్యత్తు మీచేతిలోనే పెట్టిన! నన్ను నీట ముంచినా.. పాల ముంచినా మీరే! నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ సేవ చేసుకుంటా! అంతేగానీ ఆ పార్టీ అభ్యర్థికి మాత్రం ఓటు వేయొద్దు! నా ప్రత్యర్థి లోకల్ కాదు.. నాన్ లోకల్! ఎన్నికలప్పుడే ఇక్కడికి వస్తారు. గెలిచినా ఇక్కడ ఉండేది లేదు. మనకు చేసేదిలేదు.
చూద్దామన్నా కనిపించరు. నాన్ లోకల్ వ్యక్తిని నమ్మి ఓట్లు వేస్తే నట్టేట మునిగినట్లే! కాబట్టి.. మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అన్నింటికీ అందుబాటులో ఉండే నాకే ఓటు వేసి గెలిపించండి!’’
..ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్న కొందరు అభ్యర్థులు స్థానికేతరులైన తమ ప్రత్యర్థుల గురించి చేస్తున్న ప్రచారం ఇది! ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగినపుడు... లోకల్- నాన్ లోకల్! అనే చర్చ విపరీతంగా ఉండేది! ఇప్పుడు ఆ పదాలకు అర్థమే మారిపోయింది. అదే నియోజకవర్గంలో పుట్టి పెరిగిన వారు లోకల్! పక్క నియోజకవర్గమో, పక్క జిల్లాకు చెందిన వారో అయితేనాన్ లోకల్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.
కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి.. తాను కామారెడ్డిలోనే పుట్టి పెరిగానని, అక్కడే చదువుకున్నానని, విద్యాసంస్థ నెలకొల్పి విద్యాదానం చేస్తున్నానని.. తనకు పోటీగా బరిలో నిలిచిన సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ నాన్‌లోకల్ అని ప్రజలకు గుర్తుచేస్తూ ప్రచారం చేస్తున్నారు. వారిలో ఎవరిని గెలిపించినా కామారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండరని.. కేసీఆర్ గజ్వేల్‌కు, రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు.. లేదా ఇద్దరూ హైదరాబాద్‌కు పరిమితమవుతారని ప్రజలకు పదేపదే చెబుతున్నారు.
బాన్సువాడ బీఆర్‌ఎస్ అభ్యర్థి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివా్‌సరెడ్డి కూడా.. తన ప్రత్యర్థులైన ఏనుగు రవీందర్‌రెడ్డి (కాంగ్రెస్), యెండల లక్ష్మీనారాయణ (బీజేపీ) నాన్‌లోకల్ అని ప్రచారం చేస్తున్నారు. వీరిలో రవీందర్‌రెడ్డి ఎల్లారెడ్డి నియోజక వర్గం నుంచి 2004, 2009, 2010, 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచి, ఆతర్వాత బీజేపీలో, ఇప్పుడు కాంగ్రె్‌సలో చేరారు. నిజామాబాద్ నగరానికి చెందిన యెండల లక్ష్మీనారాయణ.. ఈసారి బాన్సువాడ నుంచి పోటీ చేస్తున్నారు.
నిజామాబాద్ అర్బన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా ఆ నియోజకవర్గానికి స్థానికుడు. అక్కడ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ కామారెడ్డి వాసి.. బీఆర్‌ఎస్ అభ్యర్థి బిగాల గణే్‌షగుప్తా మాక్లూర్ (ఆర్మూర్ నియోజకవర్గం)వాసి.. అని ధన్‌పాల్ ప్రచారం చేస్తున్నారు. స్థానికేతరుడైన గణే్‌షగుప్తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, స్థానికుడైన తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ధన్‌పాల్ సెంటిమెంటు అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.
ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిది.. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలంలోని జాన్కంపేట గ్రామం! కానీ 2014, 2018 ఎన్నికల్లో జీవన్‌రెడ్డి... ఆర్మూర్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. మూడోసారి కూడా పోటీలో ఉన్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న ప్రొద్దుటూరి వినయ్‌కుమార్‌రెడ్డిది ఆర్మూర్ మండలం కోమన్‌పల్లి గ్రామం! వీరిద్దరూ ఒకప్పటి మిత్రులు. జీవన్‌రెడ్డి స్థానికేతరుడని, తాను స్థానికుడినని... తననే గెలిపించాలనే వాదనను వినయ్‌రెడ్డి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు.
మహేశ్వరం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి అంటూ నాన్ లోకల్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.
జనగామ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి.. బీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్థానికేతరుడని ప్రచారం చేస్తున్నారు. ఖాజిపేట- సోడషపల్లి ప్రాంతానికి చెందిన రాజేశ్వర్‌రెడ్డి.. జనగామకు వలసవచ్చారని చెబుతున్నారు.
పరకాల బీఆర్‌ఎస్ అభ్యర్థి.. సిటింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా.. కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డిది నర్సంపేట నియోజకవర్గం అని ప్రజలకు గుర్తుచేస్తూ ప్రచారం సాగిస్తున్నారు.
పార్టీ, మేనిఫెస్టో బలాలపైనే..
లోకల్- నాన్ లోకల్ ఫీలింగ్ వచ్చిన నియోజకవర్గాల్లో ప్రత్యర్థుల ప్రచారాన్ని అదిగమించడానికి.. స్థానికేతరులైన అభ్యర్థులు పార్టీ బలం, ప్రజలకిచ్చే హామీలపైనే నమ్మకం పెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రె్‌సకు అనుకూల పవనాలు వీస్తున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆరు గ్యారెంటీలు తమను గెలిపిస్తాయని కేఎల్‌ఆర్, మధుయాష్కీ, ప్రకాశ్ రెడ్డి, రవీందర్ రెడ్డి లాంటి కాంగ్రెస్ అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. ఇక బీఆర్‌ఎస్ అభ్యర్థులు గడిచిన తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ పాలన, సంక్షేమ- అభివృద్ధి పథకాలనే బలంగా భావిస్తున్నారు.