Malla Reddy: మల్లారెడ్డికి గడ్డుకాలం! ప్లాన్ బోల్తా కొడుతోంది!
ABN , First Publish Date - 2023-11-20T11:15:53+05:30 IST
పాలమ్మినా.. పూలమ్మినా... కష్టపడి పైకొచ్చినా... అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు నా దగ్గర ఫర్‌ఫెక్ట్ ప్లానింగ్ ఉంది.. హార్డ్‌వర్క్, డిసిప్లేన్ ఉంది.. అంటూ ప్రతీ సభలో చెప్పే మల్లారెడ్డికి మేడ్చల్ నియోజకవర్గంలో
మేడ్చల్ నియోజకవర్గంలో చేజారుతున్న బీఆర్‌ఎస్ కీలకనేతలు
ఆ పార్టీ ప్రజాప్రతినిధులదీ అదే దారి
మంత్రి మల్లారెడ్డిపై ఎగిసిపడుతున్న అసంతృప్తి
ఆయన వైఖరిపై తీవ్ర ఆగ్రహం..
ఇప్పటికే పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిక
త్వరలో భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పనున్న నేతలు!
పాలమ్మినా.. పూలమ్మినా... కష్టపడి పైకొచ్చినా... అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు నా దగ్గర ఫర్‌ఫెక్ట్ ప్లానింగ్ ఉంది.. హార్డ్‌వర్క్, డిసిప్లేన్ ఉంది.. అంటూ ప్రతీ సభలో చెప్పే మల్లారెడ్డికి మేడ్చల్ నియోజకవర్గంలో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి వైఖరితో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన నేతలు బీఆర్‌ఎ్‌సను వీడుతున్నారు. నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రె్‌సలోకి వలసలను మాత్రం నివారించలేక పోతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా మేడ్చల్ జిల్లాలోనే అధికార పార్టీ నుంచి వలసలు తీవ్ర రూపం దాల్చాయి. వాటిని ఆపేదెలా అని మల్లారెడ్డి ఆందోళనలో పడ్డారు.
మేడ్చల్ బీఆర్‌ఎస్‌లో కుదుపులకు మంత్రి మల్లారెడ్డి వైఖరే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదన్న కారణంతో ముందుగా మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి షాక్ ఇచ్చారు. అతనితో పాటే ఆయన కుమారుడు, జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి కూడా హస్తం చెంతకు చేరారు.
ప్రతిరోజూ నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు వెళ్లడం నిత్యకృత్యంగా మారింది. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున మల్లారెడ్డికి షాకిచ్చారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్ గూటికి చేరారు.
బీఆర్‌ఎస్ నుంచి నిత్యం కాంగ్రెస్‌లోకి చేరికలను చూసి ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి అయోమయంలో పడ్డారని, వలసలను ఆపడం ఎలాగో తెలియక తల పట్టుకుంటున్నారని ఆ పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. ఎన్నికల్లో గెలవడానికి నా దగ్గర పర్‌ఫెక్ట్ ప్లాన్ ఉందని నిత్యం చెప్పే మల్లారెడ్డి వలసలను ఆపేందుకు ఏ ప్లానూ వేయలేక పోతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది.
మేడ్చల్. నవంబరు 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : మేడ్చల్ నియోజకవర్గం నుంచి రెండోసారి కూడా విజయం సాధిస్తానని చెబుతున్న మంత్రి మల్లారెడ్డికి పార్టీ నేతలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే పార్టీలో కీలక నేతలు పార్టీని వీడగా మరికొందరు నేతలు పార్టీని వీడేందుకు సిద్ధ్దమవుతున్నారు. ఎన్నికల పక్రియ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు మేడ్చల్ నియోజకవర్గంలో అధికార బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రె్‌సకు భారీగా వలసలు జరుగుతూనే ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో నేతలు పార్టీని వీడి ప్రతిపక్ష కాంగ్రె్‌సలో చేరడం అధికార పక్షానికి మింగుడు పడడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా మేడ్చల్ జిల్లాలోనే అధికార పార్టీ నుంచి వలసలు జరుగుతున్నాయి. తొలుత నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేసి కాంగ్రె్‌సలో చేరారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు, మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి కూడా పార్టీని వీడారు. అక్కడ నుంచి కాంగ్రె్‌సలో వలసలు మొదలయ్యాయి. ఎన్నికల్లో గెలిచేందుకు నా దగ్గర ఫర్‌ఫెక్ట్ ప్లానింగ్ ఉంది.. హార్డ్ వర్క్, డిసిప్లేన్ ఉంది.. అంటూ ప్రతీ సభలో చెప్పే మల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ వలసలను మాత్రం అడ్డుకోలేక పోతున్నారు. అంతేకాదు కొన్నిచోట్ల ప్రచారానికి వెళుతున్న ఆయన్ని స్థానికులు అడ్డుకున్న సందర్భాలూ ఉన్నాయి.
ఇదిలా ఉంటే త్వరలో పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, మాజీ ఎంపీటీసీలు పెద్ద సంఖ్యలో పార్టీనీ వీడేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే బీఆర్‌ఎస్ వర్గాలు మాత్రం వీటిని ఖండిస్తున్నాయి. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కీలకంగా పనిచేసిన నేతల్లో చాల మంది ఇప్పటికే పార్టీని వీడారు. ఇందుకు మంత్రి వైఖరి కూడా కొంత కారణమని పార్టీ నేతలు కొందరు బహిరంగానే మాట్లాడుతున్నారు. గడిచిన కొన్నాళ్లుగా ఇక్కడ పార్టీ బలహీనపడుతున్న సంకేతాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్లారెడ్డికి ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా 87,990 ఓట్ల మెజార్టీ లభించింది. కానీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి మెజార్టీ అంతా తారుమారైంది. స్వయంగా మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్‌రెడ్డి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగినా కూడా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి పోలైన ఓట్లలో దాదాపు 80వేల ఓట్లు బీఆర్‌ఎస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పుంజుకున్నప్పటికీ దీన్ని నిలబెట్టుకోలేకపోయింది. గడిచిన కొంత కాలంగా అనేక మంది ప్రజా ప్రతినిధులు నియోజకవర్గంలో పార్టీ వీడారు. మంత్రిమల్లారెడ్డికి వైఖరికి వ్యతిరేకంగా మేడ్చల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు గత ఏడాది చివరిలో అసమ్మతి సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. తరువాత పార్టీ పెద్దలు వారికి నచ్చచెప్పడంతో అప్పట్లో వివాదం సద్దుమణిగింది.
కొనసాగుతున్న వలసల పరంపర
ఎన్నికల ప్రచార పర్వం మొదలైన తరువాత మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఆయన కుమారుడు మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి తొలుత పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. అక్కడ నుంచి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన నేతలు, ప్రజా ప్రతినిధులు బీఆర్‌ఎ్‌సను వీడుతున్నారు. ఇటీవల ఘట్‌కేసర్ మున్సిపాలిటీకి చెందిన ఆరు మంది కౌన్సిలర్లు, పోచారం మునిసిపాలిటీకి చెందిన ఒక కౌన్సిలర్, ఘట్‌కేసర్ సింగిల్‌విండో చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి, మాజీసర్పంచ్‌లు, బోడుప్పల్ కార్పోరేషన్ నుంచి ఐదు మంది కార్పోరేటర్లు, ఫీర్జాదిగూడ నుంచి పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రె్‌సలో చేరారు. మండల రైతుబంధు కన్వీనర్ కొంతం అంజిరెడ్డి అతని అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రె్‌సలో చేరారు.
అలాగే శామీర్‌పేట ఎంపీటీసీ డప్పుసాయిబాబా, మాజీ సర్పంచ్‌లు కిషోర్‌యాదవ్, శంకర్‌గౌడ్, బొమ్మరాసిపేట్ ఎంపీటీసీ ఇందిరారెడ్డి, మజీద్‌పూర్ ఎంపీటీసీ అశోక్‌రెడ్డి, అలియాబాద్ నుంచి రైతుబంధు కన్వీనర్ కృష్ణారెడ్డి బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రె్‌సలో చేరారు. ఇక మంత్రి ఏకపక్ష నిర్ణయాలతో విసుగుచెందిన శామీర్‌పేట, మూడుచింతలపల్లి మండల ప్రజా ప్రతినిధులు , ఉద్యమకారులు విష్ణువర్థన్‌రెడ్డి, కృష్ణారెడ్డితో పాటు మూడు చింతలపల్లి మండల రైతుబంధు అధ్యక్షురాలు శ్యామల, మాజీ ఎంపీటీసీలు, మంజుల, మాధవరెడ్డి, మగ్గం ప్రతా్‌పరెడ్డి, సురేందర్‌రెడ్డి, చంద్రకళ సహా మరికొందరు రాజీనామా చేశారు. మేడ్చల్ జిల్లా ముదిరాజ్‌సంఘం ఉపాధ్యక్షుడు అనిల్ ముదిరాజ్ బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మేడ్చల్ మండలంలోని ఎల్లంపేట్ సర్పంచ్ వెన్నెల, ఎంపీటీసీ సభ్యుడు కుమార్‌లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా మూడుచింతలపల్లి మండలంలో మాజీ సర్పంచ్‌లు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు, దమ్మాయిగూడ మాజీ సర్పంచ్ రామారం వెంకటే్‌షగౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యులతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా ప్రతిరోజు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎ్‌సకు గుడ్‌బై చెప్పి కాంగ్రె్‌సలో చేరుతున్నారు.
కాంగ్రెస్‌లో చేరిన కీసర వైస్ ఎంపీపీ, ఉపసర్పంచ్
కీసర: కీసర మండల వైస్ ఎంపీపీ, ఉపసర్పంచ్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వైస్‌ఎంపీపీ జలాల్‌పురం సత్తిరెడ్డి, కీసర ఉపసర్పంచ్ తటాకం లక్ష్మణ్ శర్మలు కొంత కాలంగా పార్టీలో తమకు గుర్తింపు, ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో వారు ఆదివారం మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే ఆభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. వీరితో పాటు కీసర గ్రామానికి చెందిన పలువురు యువకులు, మహిళలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోలా కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రామిడి విజయ్‌రెడ్డి, జూపల్లి రవీందర్, తటాకంఉమాపతి, వెంకటేష్, చిక్కుడు రమేష్, కందాడి సత్తిరెడ్డి, అభిలాష్, మల్లేష్ యాదవ్, రాజు యాదవ్, శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి