Share News

TS Election2023: మున్నూరు వార్‌!.. వెలమల కోటలో బీసీ నేతల పోరాటం

ABN , First Publish Date - 2023-11-15T04:32:31+05:30 IST

కరీంనగర్‌.. వెలమల కోట! తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండాదండ! ఆయనకు సెంటిమెంట్‌ జిల్లా కూడా! అంతేనా..

TS Election2023: మున్నూరు వార్‌!.. వెలమల కోటలో బీసీ నేతల పోరాటం

కరీంనగర్‌లో కాపుల కదనం.. వెలమల కోటలో బీసీ నేతల పోరాటం

నాలుగో విజయం కోసం గంగుల ఆరాటం..

బోణీ కొట్టాలని బండి సంజయ్‌ పోరాటం..

6 గ్యారెంటీలపై శ్రీనివాస్‌ ఆశల పల్లకి

కరు హ్యాట్రిక్‌ ఎమ్మెల్యే! రాష్ట్రంలో కీలక మంత్రి కూడా! ఇప్పుడు నాలుగోసారి గెలవాలనే ఉత్సాహంతో ఉన్నారు! మరొకరు.. ఆయన చేతిలోనే వరుసగా రెండుసార్లు ఓటమి పాలయ్యారు! కానీ, ఇక్కడి నుంచే ఎంపీగా మాత్రం ఘన విజయం సాధించారు! ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ ఓ వెలుగు వెలిగారు! ఇప్పుడు రాష్ట్రంలోనే ఫైర్‌ బ్రాండ్‌! ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనే పట్టుదలతో ఉన్నారు! వీరిలో ఒకరు గంగుల కమలాకర్‌ అయితే.. మరొకరు బండి సంజయ్‌ కుమార్‌! ఇక, రెండు దశాబ్దాలుగా పట్టు కోల్పోయిన కరీంనగర్‌ కోటపై జెండా ఎగరేయాలని కాంగ్రెస్‌ పార్టీ.. రేవంత్‌ రెడ్డి కుటుంబానికి సన్నిహితుడు, బొమ్మకల్‌ సర్పంచ్‌ పురుమల్ల శ్రీనివా్‌సను బరిలోకి దించింది! విచిత్రం ఏమిటంటే.. ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురూ మున్నూరు కాపులే! అందుకే, వీరి మధ్య కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ‘బిగ్‌ ఫైట్‌’ జరుగుతోంది!

కరీంనగర్‌.. వెలమల కోట! తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండాదండ! ఆయనకు సెంటిమెంట్‌ జిల్లా కూడా! అంతేనా.. కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉత్తర తెలంగాణ జిల్లాల రాజకీయాలకు గుండెకాయలా భావిస్తారు. ఇప్పుడు ఇక్కడ అత్యంత ప్రతిష్ఠాత్మక పోరు జరుగుతోంది. నిజానికి, రాష్ట్ర, జిల్లా రాజకీయాలను ఇక్కడి వెలమలు ప్రభావితం చేస్తూ వస్తున్నారు. రాజకీయ ఆధిపత్యాన్ని చాటుతూ వచ్చారు. సామాజిక వర్గాలుగా చూస్తే తొమ్మిదిసార్లు వెలమలే విజయం సాధించారు. బ్రాహ్మణ, వైశ్య, రెడ్డి కులాలకు చెందినవారు ఒక్కోసారి ప్రాతినిధ్యం వహించారు. కానీ, 2009 తర్వాత నియోజకవర్గ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. వెలమల కోటలో తొలిసారిగా బీసీలు పాగా వేశారు. ఆ వర్గానికి చెందిన టీడీపీ అభ్యర్థి గంగుల కమలాకర్‌ తొలిసారిగా ఇక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. వరుసగా మూడు ఎన్నికల్లో విజయంతో హ్యాట్రిక్‌ సాధించి ఇక్కడ బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని గంగుల సుస్థిరం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు. ‘రాష్ట్రం ఏర్పడక ముందున్న కరీంనగర్‌ను, ఇప్పటి కరీంనగర్‌ను పోల్చి చూడండి. ఉమ్మడి పాలనలో నియోజకవర్గ అభివృద్ధికి ఆనాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో వందల కోట్ల నిధులు తీసుకొచ్చి కరీంనగర్‌ను రాష్ట్రంలోనే రెండో అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దుతున్నాం. పదేళ్లలో ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన అభివృద్ధి, ప్రభుత్వ పథకాలను చూసి ఈ అభివృద్ధి, సంక్షేమం కొనసాగేందుకు మరోసారి ఆశీర్వదించి గెలిపించండి’ అని ఆయన ప్రజల్లోకి వెళుతున్నారు.

గెలిస్తే.. బీజేపీ బోణీ!

కరీంనగర్‌ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 1952 నుంచి జరిగిన 15 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఐదుసార్లు, టీడీపీ నాలుగుసార్లు, టీఆర్‌ఎస్‌ రెండుసార్లు, పీడీఎఫ్‌, సోషలిస్టు, సంజయ్‌ విచార్‌ మంచ్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు ఒక్కోసారి గెలుపొందారు. తప్పితే, బీజేపీ ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా గెలవలేదు. ఇప్పుడు బీజేపీ గెలిస్తే ఆ పార్టీ ఇక్కడ బోణీ కొట్టినట్టు అవుతుంది. అందుకే, గత రెండు ఎన్నికల్లో గంగుల కమలాకర్‌ చేతిలో పరాజయం పాలైన సంజయ్‌ ఈసారి విజయం సాధించాలని పావులు కదుపుతున్నారు. ఎంపీగా కరీంనగర్‌ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి మంజూరు చేయించిన నిధుల వివరాలను ప్రచార అస్త్రంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో మరింత అభివృద్ధి చేస్తామంటూ హామీ ఇస్తున్నారు.

ఆరు గ్యారెంటీలే హామీ

ఇటీవలే బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేసి కాంగ్రె్‌సలో చేరిన పురుమల్ల శ్రీనివా్‌సను ఆ పార్టీ బరిలోకి దింపింది. పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల కార్డుతో ఆయన ఇంటింటి ప్రచారం చేయడంతోపాటు కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం చేస్తున్నారు.

ఎవరి మొగ్గు ఎటు!?

ఈ ఎన్నికల్లో కుల సమీకరణాలు ఫలితాలను నిర్దేశించనున్నాయి. ముగ్గురూ కాపు సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులే కావడంతో ఆ వర్గం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. మైనారిటీ, దళిత ఓట్లపై కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది. రేవంత్‌ రెడ్డి కాంగ్రె్‌సకు నాయకత్వం వహించడం, బీఆర్‌ఎస్‌ వెలమ ఆధిపత్యంలో కొనసాగుతుండడాన్ని వ్యతిరేకించే రెడ్డి వర్గం ఈసారి కాంగ్రె్‌సకు ఓటు వేయవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇక, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులపై సంపూర్ణ విశ్వాసంతో, గెలుపు ధీమాతో ఉన్న బీఆర్‌ఎస్‌.. మైనారిటీలు, బీసీ వర్గాల అండదండలు, అన్ని కులాల్లోని అభిమానుల ఓట్లే తమను గెలిపిస్తాయని భావిస్తోంది. హిందూత్వ నినాదంతోపాటు కేంద్ర పథకాల ద్వారా విడుదలైన నిధులతో జరిగిన అభివృద్ధి, సంక్షేమ ఫలితాలపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. హిందూ భావజాల వ్యాప్తి, ఐక్యతా నినాదాలు అన్ని కులాల్లోనూ వ్యాప్తిచేసి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోంది. మైనారిటీలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య విడిపోతే.. హిందువులు మెజార్టీగా తమకు అండగా నిలుస్తారని, అలాగే, బీసీల్లోని పలు సామాజికవర్గాలు ప్రధానంగా కాపు, ముదిరాజ్‌, పద్మశాలి ఓటు బ్యాంకుగా నిలుస్తాయని ఆ పార్టీ ఆశిస్తోంది.

Updated Date - 2023-11-15T11:16:53+05:30 IST