Revanth Reddy: మూడు దశాబ్దాల తర్వాత హిస్టరీ!
ABN , First Publish Date - 2023-12-06T04:49:24+05:30 IST
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలోనూ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేత.. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భం గత మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ లేదు.
వైఎస్సార్‌కు దక్కని అవకాశం రేవంత్‌కు
పీసీసీ అధ్యక్షుడు సీఎం కావడం 3 దశాబ్దాల తర్వాత ఇప్పుడే
హైదరాబాద్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలోనూ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేత.. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భం గత మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ లేదు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం, ఆయనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనుండటం అరుదైన రికార్డుగా చెప్పుకోవచ్చు. వైఎ్‌స.రాజశేఖర్ రెడ్డి సారథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ బాగా బలపడింది. ఆయన రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో పార్టీ మాత్రం అధికారంలోకి రాలేకపోయింది. గతంలో అసెంబ్లీలో పార్టీ శాసనసభాపక్ష నేతగానూ వ్యవహరించిన వైఎస్సార్.. 2004, 2009లో రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ రెండు సమయాల్లో పీసీసీ అధ్యక్షుడిగా ధర్మపురి శ్రీనివాస్ ఉన్నారు. ఇక 1975, 1989లో మర్రి చెన్నారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఆ రెండు సమయాల్లో చెన్నారెడ్డే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మళ్లీ ఆ అవకాశం రేవంత్ రెడ్డికి వచ్చింది.