Rapido: ఉచితంగా ప్రయాణించండి.. ఓటేయండి!
ABN , First Publish Date - 2023-11-28T14:23:19+05:30 IST
రవాణా సమస్యతో ఏ ఒక్కరూ పోలింగ్ స్టేషన్‌కు వెళ్లలేదనే మాట రాకుండా చేయడం కోసమే తాము ఈ ఆఫర్ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పోలింగ్ బూత్‌కు ఉచితంగా రైడ్ అందించనున్న ర్యాపిడో
హైదరాబాద్ సిటీ: ఓటేయండి.. ఉచితంగా ప్రయాణించండి.. అంటూ వినూత్న ఆఫర్‌తో ర్యాపిడో నగరవాసుల ముంగిటకొచ్చింది. ఓటేయడానికి ఇంట్లో నుంచి కదలడమే కష్టమనుకునే వారికోసం.. మీరు సంకల్పించండి... మిమ్మల్ని పోలింగ్ బూత్‌కు ఉచితంగా తీసుకెళ్లే పూచీ మాది.. అని రైడ్ షేర్ కంపెనీ ర్యాపిడో ప్రకటించింది. హైదరాబాద్ నగర పరిధిలో 2,600 పోలింగ్ స్టేషన్ల వద్ద తమ సేవలను వినియోగించుకోవచ్చని, తమ కెప్టెన్లు సదా నగరవాసుల సేవలో సిద్ధంగా ఉంటారని తెలిపింది. ఈ నెల 30వ తేదీన పోలింగ్ సమయాల్లోనే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, దానికోసం వోట్ నౌ (VOTENOW) అనే కోడ్ అప్లయ్ చేయాలని సంస్ధ సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి చెప్పారు. ప్రతి ఓటు అత్యంత కీలకమైనదని, రవాణా సమస్యతో ఏ ఒక్కరూ పోలింగ్ స్టేషన్‌కు వెళ్లలేదనే మాట రాకుండా చేయడం కోసమే తాము ఈ ఆఫర్ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతిసారీ హైదరాబాద్ నగరంలో ఓటింగ్ 55 శాతానికి మించడం లేదని.. ఈసారి అది మారాల్సిన అవసరం ఉందన్నారు. దానికోసమే తమ ప్రయత్నమని ఆయన చెప్పుకొచ్చారు.