Share News

Revanth Reddy: జర్నలిస్టుగా ఉన్నప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి ఎలా ఉన్నారో చూశారా?

ABN , First Publish Date - 2023-12-04T15:38:59+05:30 IST

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ గెలుపు వెనుక ప్రధానంగా రేవంత్‌రెడ్డి పేరే వినిపిస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి పార్టీని ముందుండి నడిపించి

Revanth Reddy: జర్నలిస్టుగా ఉన్నప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి ఎలా ఉన్నారో చూశారా?

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ గెలుపు వెనుక ప్రధానంగా రేవంత్‌రెడ్డి పేరే వినిపిస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి పార్టీని ముందుండి నడిపించి విజయతీరాలకు చేర్చిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కుతుంది. ఇక ముఖ్యమంత్రి పీఠాన్ని అదిరోహించనున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌తో ఉన్న స్మృతులను స్నేహితులు, శ్రేయోభిలాషులు గుర్తు చేస్తుకుంటున్నారు.

తాజాగా జర్నలిస్టుగా పని చేస్తున్న సమయంలో సాటి సహోద్యోగులతో దిగిన ఓ ఫొటో సోషల్ మీడియాలతో తెగ వైరల్ అవుతోంది. మూడు దశాబ్దాల క్రితం జాగృతి అనే వార పత్రికలో రేవంత్ జర్నలిస్టుగా పని చేశారు. ఆ సమయంలో తోటి కొలిగ్స్‌తో దిగిన ఆ నాటి స్మృతులను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇతనే అంటూ ఆ నాటి చిత్రాన్ని పలువురు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు పలు రకాలుగా ఆసక్తికర ట్వీట్లు చేస్తున్నారు.

revanth-cm.jpg

జర్నలిస్టు నుంచి సీఎం కుర్చీ దాకా..

ప్రస్తుత పీసీసీ చీఫ్, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జర్నలిస్టు నుంచి సీఎం కుర్చీ దాకా ఆయన ప్రస్థానం ఇలా సాగింది. అనుముల రేవంత్‌రెడ్డి.. బాల్యం నుంచే ఆయనదో ప్రత్యేక శైలి. దూకుడు స్వభావం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారాన్ని ‘హస్త’గతమయ్యేలా చేసిన వ్యక్తి. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే పార్టీని గద్దెనెక్కించిన నేత. ఆయన ప్రతి అడుగూ సంచలనమే. రేవంత్‌ రాజకీయ ప్రస్థానంలో ప్రతి దశా ఆసక్తికరమే. కింద పడిన ప్రతిసారీ మళ్లీ ఒక మెట్టు పైకి ఎదిగారే తప్ప.. ఎన్నడూ కుంగిపోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వెంటనే లోక్‌సభ ఎన్నికల్లో గెలవడం.. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టిన కేసీఆర్‌ పతనం కోసమే పనిచేయడం.. అనుకున్నది సాధించడం ఆయనకే చెల్లింది! ‘ఈ రాష్ట్రానికి ఎప్పుడో ఒకప్పుడు సీఎం అవుతా’ అంటూ 22 ఏళ్ల క్రితమే చెప్పిన రేవంత్‌.. అదే లక్ష్యంతో పనిచేశారు. 1969 నవంబరు 8న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి దగ్గరలోని కొండారెడ్డిపల్లిలో అనుముల నర్సింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు రేవంత్‌రెడ్డి జన్మించారు. ఆయనకు ఏడుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. వీరిది సాధారణ రైతు కుటుంబం. రేవంత్‌కు చిన్ననాటి నుంచే రాజకీయాలంటే ఆసక్తి. ఆరెస్సె్‌సలో చురుగ్గా పనిచేసేవారు.

ఏవీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఏబీపీవీలో పనిచేశారు. డిగ్రీ పూర్తయిన తర్వాత కాంగ్రెస్‌ నేత జైపాల్‌రెడ్డి తమ్ముడి కుమార్తె గీతారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఈ పెళ్లి కూడా సంచలనమే. రేవంత్‌ దంపతులకు ఒక కుమార్తె నైమిషారెడ్డి. తొలుత ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వహించారు. తర్వాత రేవంత్‌.. జూబ్లీహిల్స్‌ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని కూడా విజయవంతంగా నిర్వర్తించారు. 2004లో కొంత కాలం టీఆర్‌ఎ్‌సలో పనిచేసి, కల్వకుర్తి అసెంబ్లీ టికెట్‌ ఆశించారు. కానీ, దక్కలేదు. దీంతో 2006లో మిడ్జిల్‌ మండలం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. స్థానిక సంస్థల కోటాలో మహబూబ్‌నగర్‌ శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2007లో టీడీపీలో చేరారు. 2009లో కొడంగల్‌ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లోనూ గెలిచారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2015 మే 15న ఆయన ఓటుకు నోటు కేసులో అరెస్టయి, జైలుకు వెళ్లారు. ఈ సమయంలోనే ఆయన కేసీఆర్‌కు సవాలు విసిరారు. ‘నా సమయం వచ్చినప్పుడు నీ అంతు చూస్తా’ అని వ్యాఖ్యానించారు. కూతురి పెళ్లి సమయంలో తనను అరెస్ట్‌ చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. తర్వాత 2017లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2018లో కొడంగల్‌ నుంచి బరిలో నిలిచి ఓడిపోయారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2021లో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడం, కాంగ్రె్‌సను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేశారు.

మాటే మంత్రము..

ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేసేలా ప్రసంగించడంలో రేవంత్‌ దిట్ట. వేదిక ఏదైనా.. పక్కన ఎంత పెద్ద నాయకుడున్నా.. ఆయన ప్రసంగానికి ఫిదా అయిపోవాల్సిందే. ఇదే రేవంత్‌కు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. కాంగ్రె్‌సలో చేరిన అనతి కాలంలోనే పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికవడం, కుదేలైన కాంగ్రె్‌సను బీఆర్‌ఎస్‌ పార్టీని ఢీకొట్టే స్థాయికి తీసుకెళ్లడం ఆయనకే సాధ్యమైంది. ‘ఈ రాష్ట్రానికి ఎప్పుడో ఒకప్పుడు ముఖ్యమంత్రిని అవుతా. అదే నా లక్ష్యం’ అంటూ చిన్న వయసులోనే రేవంత్‌రెడ్డి చేసిన వాఖ్యలను ఆయన స్నేహితులు గుర్తుచేస్తున్నారు. దీన్నిబట్టే ఆయన ఎంత నిష్టగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో, దాన్ని చేరుకోవడానికి ఎంత పట్టుదలగా పనిచేశారో అర్థం చేసుకోవచ్చు.

Updated Date - 2023-12-05T22:05:23+05:30 IST