CBI : వివేకా హత్యకు కుట్ర చేసింది.. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డే..
ABN , First Publish Date - 2023-07-21T11:12:21+05:30 IST
మాజీ మంత్రి, జగన్ చిన్నాన్న వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్రపై కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. వివేకా హత్య కేసు చార్జిషీట్‌లో పలు అంశాలను ప్రస్తావించింది. కుట్ర, హత్య సాక్ష్యాల చెరిపివేతను సీబీఐ ఇలా వివరించింది.
హైదరాబాద్ : మాజీ మంత్రి, జగన్ చిన్నాన్న వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్రపై కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. వివేకా హత్య కేసు చార్జిషీట్‌లో పలు అంశాలను ప్రస్తావించింది. కుట్ర, హత్య సాక్ష్యాల చెరిపివేతను సీబీఐ ఇలా వివరించింది. ఫోటోలు, గూగుల్ టేక్ అవుట్, ఫోన్ల లొకేషన్ డేటాలను సీబీఐ కోర్టుకు సమర్పించింది. వివేకా హత్యకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కుట్ర చేశారని తెలిపింది. వివేకానంద రెడ్డి హత్య కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ తెలిపింది.
వివేక పీఏ కృష్ణారెడ్డి పై అనుమానాలు ఉన్నప్పటికీ తగిన ఆధారాలు లభించలేదని సీబీఐ వెల్లడించింది. సాక్ష్యాల చెరిపివేత సమయంలో వైఎస్ మనోహర్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన ప్రమేయంపై నిర్ధారణ కాలేదన్నారు. వివేకా ఇంట్లో వైఫై రూటర్లకు కనెక్టయిన వారి వివరాలు సేకరిస్తున్నామని తెలిపింది. వైఫై రూటర్ల వివరాల కోసం అమెరికా అధికారులకు కోరామని సీబీఐ అధికారులు వెల్లడించారు. వివేకా లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్ష నివేదిక రావాల్సి ఉందన్నారు. పలు మొబైల్ ఫోన్ల ఫోరెన్సిక్ నివేదికలు త్రివేండ్రం సీ డాక్ నుంచి అందాల్సి ఉందని తెలిపారు. గత నెల 30న సీబీఐ సమర్పించిన చార్జిషీట్‌ను ఇటీవల విచారణకు కోర్టు స్వీకరించింది.
చార్జిషీట్‌లోని మరికొన్ని కీలక విషయాలు..
వివేకా కేసులో 145 పేజీల చార్జిషీట్ కోర్టుకు సీబీఐ సమర్పించింది. ‘‘2017 ఎన్నికల్లో MLC గా పోటీ చేసిన వివేకాను ఓడించారు. ఎమ్మెల్సీ టికెట్‌ను దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డికి ఇవ్వక పోవడంతో వివేకాను ఓడించారు. దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి, అవినాష్ కి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అప్పటి నుంచే వివేకాకు అవినాష్, అతని తండ్రి భాస్కర్ రెడ్డిపై కోపం ఉంది. దీంతో ఎర్ర గంగి రెడ్డిని లోబర్చుకొని.. వివేకా హత్య కు పథకం వేశారు. అవినాష్ కు ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని వివేకానంద రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించాడు. దీంతో వివేకాను హత్య చేయడానికి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డి కుట్ర పన్నారు.
కేసు విచారణ సమయంలో వివేకా పీఏ ఎంబీ కృష్ణారెడ్డిపై అనుమానాస్పదంగా ఉంది. వివేకాది హత్య అని తెలిసి వివేకా లెటర్ చూసిన తర్వాత కూడా సౌభాగ్యమును తప్పుదోవ పట్టించేలా కృష్ణారెడ్డి వ్యవహరించాడు. వివేకానంద రెడ్డి ఇంట్లో లేడని తిరుపతి వెళ్ళాడంటూ అక్కడికి వచ్చిన కార్యకర్తలకు చెప్పాడు. హత్య జరిగిందని తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించాడు. ఘటనా స్థలంలో ఆధారాలను చెరిపి వేస్తున్నప్పటికీ చూసి కృష్ణారెడ్డి మౌనం వహించాడు. ఈ హత్యలు వైఎస్ మనోహర్ రెడ్డి పాత్ర ఉన్నట్లు A4 నిందితుడు అప్రూవర్ దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చాడు. సీన్ ఆఫ్ క్రైమ్ లో సాక్షాలను ధ్వంసం చేసే సమయంలో మనోహర్ రెడ్డి అక్కడే ఉన్నాడు. కానీ అతని సాక్షాలను ధ్వంసం చేసినట్లు ఆధారాలు లేవు’’ అని చార్జిషీట్‌లో సీబీఐ పేర్కొంది.