Bandi Sanjay: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ ఘటనపై సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

ABN , First Publish Date - 2023-03-17T19:11:59+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) విమర్శలు గుప్పించారు.

Bandi Sanjay: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ ఘటనపై సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) విమర్శలు గుప్పించారు. కేసీఆర్ నిర్బంధాలకు బెదిరేది లేదని, అరెస్టు చేసిన బీజేవైఎం కార్యకర్తలను విడుదల చేయాలని బండి డిమాండ్ చేశారు.

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ ఘటనపై (TSPSC Paper Leakage) పరీక్షలు రద్దు చేసి చేతులు దులుపుకోవడం కాదని, మొత్తం పబ్లిక్ సర్వీస్ కమిషన్ను రద్దు చేయాలని బండి సంజయ్ ఆగ్రహాన్ని వెలుబుచ్చారు. కోచింగ్ సమయంలో నిరుద్యోగులకు జరిగిన నష్టానికిగాను రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని బండి సంజయ్ అన్నారు. ఘటనపై సిటింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కార్ఖానా పీఎస్ నుంచి విడుదలైన వెంటనే స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనను బండి సంజయ్ పరిశీలించారు.

గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను కూడా టీఎస్‌పీఎస్సీ (TSPSC) రద్దు చేసింది. ఇప్పటికే ఏఈ పరీక్ష (AE Exam) తో పాటు టౌన్‌ ప్లానింగ్‌, వెటర్నరీ అసిస్టెంట్‌ ఎగ్జామ్‌ పేపర్లను రద్దు చేసింది. తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్‌తో పాటు ఏఈఈ, డీఏవో పరీక్ష పేపర్లను కూడా రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను 2022, సెప్టెంబర్‌ 16న నిర్వహించారు. రద్దు చేసిన ఈ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను జూన్‌ 11న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. సిట్‌ నివేదిక ఆధారంగా ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది. 2023, జనవరి 22న ఏఈఈ, ఫిబ్రవరి 26న డీఏవో పరీక్షలను నిర్వహించారు. త్వరలో జరగబోయే మరిన్ని పరీక్షలను కూడా వాయిదా వేసే యోచనలో టీఎస్‌పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-03-17T19:13:50+05:30 IST