BRS Govt: కాసులకూ దోస్తీ!

ABN , First Publish Date - 2023-07-30T02:10:17+05:30 IST

ఓవైపు అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections) సమీపిస్తున్నాయి. సంక్షేమ పథకాల(Welfare schemes) అమలు అత్యంత ప్రాధాన్య అంశంగా మారింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధుల సమస్య వెంటాడుతోంది.

BRS Govt: కాసులకూ దోస్తీ!

అప్పులపై పరిమితులను సవరించాలని రాష్ట్ర సర్కారు వినతి

మరిన్ని అప్పులకు అనుమతించాలని విజ్ఞప్తి

బీజేపీతో ఇప్పటికే కుదిరిన సఖ్యతతో పావులు!

ఎన్నికల వేళ సంక్షేమ పథకాలకు నిధుల సమస్య

ప్రతిష్ఠాత్మక పథకాల అమలుకూ లేని నిధులు

ఏ మూలకూ సరిపోని ఆదాయం, అప్పులు

రాబడి పెంచుకునే మార్గాల కోసం అన్వేషణ

ఎక్సైజ్‌ ఆదాయాన్నీ ముందస్తుగా రాబట్టే యత్నం

వైన్‌షాపుల లైసెన్సు గడువు తీరకముందే టెండర్లు!

ఏపీ నుంచి రావాల్సిన విద్యుత్తు బకాయిలు

రూ.17,828 కోట్లు ఇప్పించాలని కేంద్రంపై ఒత్తిడి

భూముల అమ్మకం, లీజుల ద్వారా మరో

రూ.15 వేల కోట్ల రాబడి వస్తుందని అంచనా

మొత్తంగా 50 వేల కోట్ల రూపాయలు

సమకూర్చుకునేందుకు విశ్వ ప్రయత్నం

హైదరాబాద్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ఓవైపు అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections) సమీపిస్తున్నాయి. సంక్షేమ పథకాల(Welfare schemes) అమలు అత్యంత ప్రాధాన్య అంశంగా మారింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధుల సమస్య వెంటాడుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వంపైనే రాష్ట్రం ఆశలు పెట్టుకుంది. రాష్ట్రంలోని అధికార బీఆర్‌ఎస్‌(BRS GOVT).. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ(BJP)తో అవగాహనకు వచ్చిందన్న ప్రచారం ఇప్పటికే జరుగుతోంది. ఈ సఖ్యతను అడ్డుపెట్టుకొని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రాష్ట్ర అప్పులపై కేంద్రం విధించిన పరిమితులను సవరించాలని కోరుతోంది. వాస్తవానికి గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఖజానాకు నిధులు నిండుకుంటున్నాయి. రాష్ట్ర రాబడులు, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, చేస్తున్న అప్పులు ఏ మూలకూ సరిపోవడం లేదు. దీంతో సంక్షేమ పథకాల అమలు కష్టతరంగా మారుతోంది. కొన్ని పథకాలను పూర్తిగా పక్కన పెట్టి.. ఎన్నికల్లో ప్రభావం చూపే పథకాలకు మాత్రమే నిధులు సర్దుబాటు చేయాలన్నా సాధ్యం కావడంలేదు. దీంతో ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం అవకాశమున్న వనరులన్నింటినీ వినియోగించుకోవడంతోపాటు అప్పుల మార్గాన్నీ ఎంచుకుంది. రాష్ట్ర రుణ పరిమితిపై విధించిన ఆక్షలను తొలగించాలని, వివిధ కార్పొరేషన్ల ద్వారా మరిన్ని రుణాలు తీసుకునేలా అనుమతించాలని కేంద్రాన్ని కోరుతోంది. తద్వారా మరో రూ.20 వేల కోట్ల రుణాలు లభిస్తాయని అంచనా వేస్తోంది. మరోవైపు వైన్‌షాపుల లైసెన్సులకు గడువు కన్నా ముందే టెండర్లు పిలిచి ఎక్సైజ్‌ ఆదాయాన్ని ముందస్తుగానే రాబట్టుకోవాలని యోచిస్తోంది. ఈ ఆదాయం రూ.2 వేల కోట్లకు పైగా వస్తుందని అంచనా వేస్తోంది. దీంతోపాటు ఔటర్‌ రింగు రోడ్డు(ఓఆర్‌ఆర్‌) వంటి ప్రాజెక్టులను లీజుకివ్వడం, ఆజామాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలోని భూములను లీజుదారుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయడం, రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లను విక్రయించడం, హెచ్‌ఎండీఏ ద్వారా ఓపెన్‌ ప్లాట్లను వేలం వేయడం వంటి కార్యక్రమాల ద్వారా నిధులు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వీటికితోడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి విద్యుత్తు బకాయిల కింద రావాల్సిన సొమ్మును ఇప్పించాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. మొత్తంగా అన్ని రకాల ప్రయత్నాల ద్వారా రూ.50 వేల కోట్లు సేకరించాలన్న తలంపుతో ప్రభుత్వం ఉంది.

ఏప్రిల్‌ నుంచే నిధుల కటకట..

వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచే రాష్ట్ర ప్రభుత్వం నిధుల కటకట ఎదుర్కొంటోంది. ప్రభుత్వానికి అన్నిరకాలుగా కలిపి నెలవారీ రాబడులు రూ.16 వేల కోట్ల వరకు సమకూరుతుంటే.. వ్యయం మాత్రం రూ.18-20 వేల కోట్ల వరకు ఉంటోంది. దీంతో ప్రతి నెలా రూ.2-4 వేల కోట్ల వరకు నిధుల నికర లోటు ఏర్పడుతోంది. పర్యవసానంగా సంక్షేమ పథకాలకు నిధులను సర్దలేకపోతోంది. వీటిలో దళిత బంధు, పంట రుణాల మాఫీ వంటి ప్రతిష్ఠాత్మక పథకాలు కూడా ఉండడం గమనార్హం. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని పథకాలను ప్రకటిస్తున్నా.. వాటిని ఇప్పటికిప్పుడు సంతృప్త స్థాయిలో అమలు చేయలేని పరిస్థితి నెలకొంది. కొత్త పథకాల కింద కొంత మంది లబ్ధిదారులను ఎంపికచేసి, వారికి మాత్రమే శాంపిల్‌గా అమలు చేసి వదిలేస్తున్నారు. పాత పథకాలను పక్కన పెడుతున్నారు. పంట రుణాల మాఫీ విషయానికే వస్తే.. రూ.లక్ష లోపు ఉన్న పంట రుణాలను పూర్తి స్థాయిలో మాఫీ చేస్తామని 2018 ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో ప్రకటించింది. రెండో విడత పాలనలో దశలవారీగా దీనిని అమలు చేయాలని యోచించింది. మొదటి దశలో రూ.25 వేల లోపు పంట రుణాలను, రెండో దశలో రూ.50 వేల లోపు, మూడో దశలో రూ.75 వేల లోపు, నాలుగో దశలో రూ.లక్ష లోపు రుణాలన్నింటినీ మాఫీ చేయాలని నిర్ణయించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.75 వేల వరకు ఉన్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని బడ్జెట్‌లో ప్రకటించింది. కానీ, రూ.37 వేల లోపు ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేసింది. దీంతో కేవలం 5.50 లక్షల మంది రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూరింది. ఇంకా 31 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేయాల్సి ఉంది. తిరిగి ఈ ఆర్థిక సంవత్సరంలోనూ రూ.లక్ష లోపు ఉన్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే ఇంకా రూ.20,351 కోట్లు కావాలని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ, అంత మొత్తం నిధులు సర్కారు వద్ద లేకపోవడంతో ప్రస్తుతానికి ఈ పథకాన్ని ప్రభుత్వం పక్కన పెట్టేసింది.

దళితబంధుకు ఇచ్చింది 850 కోట్లే..

ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, దళితుల ఓట్లే టార్గెట్‌గా ప్రకటించిన దళిత బంధు పథకం గురించి ఎంత తక్కువగా చెప్పుకొంటే అంత మంచిందని దళిత సంఘాలు దెప్పి పొడుస్తున్నాయి. ఈ పథకం కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.17,700 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం(2023-24)లో అంతే మొత్తం రూ.17,700 కోట్లను కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. కానీ, గతేడాది కేటాయింపులో నయా పైసా కూడా విదల్చలేదని మండిపడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలోని 1100 మంది లబ్ధిదారులకు పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపింది. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున 118 నియోజకవర్గాల్లోని 1,29,800 కుటుంబాలకు పథకాన్ని అమలు చేస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించింది. కానీ, రూ.17,700 కోట్లలో ఇప్పటివరకు రూ.850 కోట్లను మాత్రమే విడుదల చేసింది. మిగతా నిధులను విడుదల చేయడం లేదు. ఈ పథకాన్ని అమలు చేయాలంటే రెండు సంవత్సరాలకు సంబంధించి రూ.34 వేల కోట్లు కావాలి. ఇంత మొత్తంలో నిధులు సర్దడం ఇప్పట్లో సర్కారు వల్ల అయ్యేలా కనిపించడంలేదు.

పెన్షన్ల కోసం వృద్ధుల ఎదురుచూపు..

వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బోధకాలు బాధితులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు వంటి వారికి అందించే ‘ఆసరా’ పెన్షన్లు ఏ నెలలోనూ ఒకటో తేదీన అందిన దాఖలాల్లేవు. రెండు నెలలు ఆలస్యంగా పింఛన్లు అందుతున్నాయని వారు వాపోతున్నారు. రాష్ట్రంలోని 43,81,000 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లు అందించాల్సి ఉంది. దీని కోసం బడ్జెట్‌లో రూ.11,728 కోట్లు ప్రతిపాదించింది. ప్రతినెలా వీటి కోసం రూ.976 కోట్లు సర్దాల్సి ఉంది. కానీ, ఈ నిధులను కూడా సర్దలేకపోతోంది. ఇక విద్యార్థులకు డైట్‌ చార్జీలు పెంచుతున్నామని సర్కారు చెబుతున్నా.. వాటిని సక్రమంగా విడుదల చేయడం లేదు. డైట్‌ చార్జీలు, స్కాలర్‌షి్‌పల కోసం తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.4,688 కోట్లు కేటాయించింది. ప్రతి ఏటా దాదాపు ఇంతే మొత్తంలో కేటాయిస్తున్నా.. వాటి విడుదల విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. 2019 నుంచి ప్రైవేటు కాలేజీల విద్యార్థులకు స్కాలర్‌షి్‌పల సొమ్మును సరిగా విడుదల చేయడం లేదు. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం ‘గృహ లక్ష్మి’ అనే కొత్త పథకాన్ని ప్రకటించింది. సొంత జాగా ఉన్నవారు ఇంటిని నిర్మించుకోవడానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ఈ పథకం కింద అందజేస్తామని తెలిపింది. ఈ పథకంతోపాటు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకానికి కలిపి బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించింది. ఇందులో గృహలక్ష్మి పథకానికే రూ.7,350 కోట్లను ప్రత్యేకించింది. మూడు దశలుగా అమలు చేస్తామని ప్రకటించిన ఈ పథకాన్ని ఇప్పటివరకు ప్రారంభించనేలేదు. అసలు దరఖాస్తులనే తీసుకోవడం లేదు.


అప్పుల కోసం కేంద్రంతో సఖ్యత!

పథకాలు పడకేస్తుండడం, ఎన్నికలు ముంచుకొస్తుండడంతో సర్కారు పునరాలోచనలో పడింది. ఎన్నికల ముందు ప్రతిష్ఠాత్మక పథకాలనైనా అమలు చేయకపోతే.. ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశముందని జంకుతోంది. అందుకే కొన్ని పథకాలనైనా అమలు చేసేందుకు నిధులను సమీకరించే పనిలో పడింది. ముందుగా అప్పుల కోసం కేంద్రం అనుమతి పొందే పని మొదలు పెట్టింది. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల మధ్య అవగాహన కుదిరిందన్న వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అప్పులపై పరిమితులను సవరించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.53,970 కోట్ల అప్పు తీసుకోవాలని రాష్ట్రం నిర్ణయించగా, కేంద్రం రూ.39,256 కోట్లకే అనుమతి ఇచ్చింది. ఇందులో రాష్ట్రానికి నికరంగా రూ.30,922 కోట్ల అప్పు మాత్రమే వచ్చింది. అంచనా వేసిన రూ.53,970 కోట్లలో రూ.14,714 కోట్ల అప్పునకు గండి పడింది. ఈ రుణాన్ని తిరిగి పొందేలా అనుమతించాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు కేంద్రాన్ని కోరినట్లు సమాచారం. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.38,234 కోట్ల అప్పును బడ్జెట్‌లో ప్రభుత్వం అంచనా వేసింది. దీనిని కూడా పెంచాలని కేంద్రాన్ని కోరుతోంది. తమ జీఎ్‌సడీపీ చాలా ఎక్కువగా నమోదవుతోందని, దీనికి తగ్గట్లుగా రుణ పరిమితిని పెంచాలని అడుగుతోంది. తద్వారా రెండేళ్ల రుణాలు అదనంగా రూ.20 వేల కోట్లకు మించి వస్తాయని ఆశిస్తోంది. మరోవైపు విద్యుత్తు వినియోగానికి సంబంధించి ఏపీ నుంచి రూ.17,828 కోట్లు రావాల్సి ఉందని, వీటిని వెంటనే ఇప్పించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది.

రూ.2 వేల కోట్ల

ఎక్సైజ్‌ రాబడిపై కన్ను..రాష్ట్రంలోని 2,620 వైన్‌ షాపుల లైసెన్సు రెండేళ్ల గడువు నవంబరు 30తో ముగియనుంది. వీటికి టెండర్లు పిలిచి కొత్త లైసెన్సుదారులను లాటరీ పద్ధతిన ఎంపిక చేయాల్సి ఉంది. 2023-25 సంవత్సరాలకుగాను కొత్త షాపులు డిసెంబరు 1 నుంచి ప్రారంభం కావాలి. కానీ, ముందస్తుగానే టెండర్లు పిలిచి, కొత్త లైసెన్సులను జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అక్టోబరులో ఎన్నికల షెడ్యూలు వెలువడితే కోడ్‌ అడ్డు వస్తుందన్న భయం కూడా వెన్నాడుతోంది. అందుకే సెప్టెంబరులో వైన్‌షాపుల టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడానికి ఎక్సైజ్‌ శాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం ఆశించినట్లు జరిగితే సెప్టెంబరులోనే మరో రూ.2 వేల కోట్లు రానున్నాయి. గతంలో వైన్‌షాపుల దరఖాస్తుల అమ్మకాల ద్వారానే రూ.1,400 కోట్లు వచ్చాయి. లైసెన్సు మొత్తం ఫీజులో మొదటి వాయిదా సొమ్మును దరఖాస్తుదారులు చెల్లించాల్సి ఉంటుంది. దీని రూపేణా మరో రూ.600 కోట్లు సమకూరుతాయి. ఈసారి దరఖాస్తుల రేటు, లైసెన్సు ఫీజులను మరింత పెంచితే.. ఈ రాబడి రూ.2,500 కోట్ల వరకు సమకూరవచ్చు. ఇవి కాకుండా భూముల అమ్మకం, రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లు, హెచ్‌ఎండీఏ ఓపెన్‌ ప్లాట్ల విక్రయాలు, ఓఆర్‌ఆర్‌ లీజు, ఆజామాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా స్థలాల సెటిల్‌మెంట్ల ద్వారా మొత్తం రూ.15 వేల కోట్లకు పైగా నిధులు వస్తాయని అంచనా వేస్తోంది. ఇందులో ఓఆర్‌ఆర్‌ లీజు ద్వారా రూ.7,380 కోట్లు వస్తాయని ఖరారు చేసింది. ఆజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంతంలోని స్థలాల ద్వారా మరో రూ.2 వేల కోట్లను అంచనా వేస్తోంది.

సీఎం వరాలకూ లేని నిధులు..

ప్రజాప్రతినిధులకు సంబంధించిన పథకాలు కూడా పడకేస్తున్నాయి. సీఎం తన ప్రత్యేక నిధి కింద బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లను కేటాయింపజేసుకున్నారు. జిల్లా కలెక్టరేట్‌ భవన సముదాయాల ప్రారంభోత్సవాల సందర్భంగా ఆయా జిల్లాలకు వరాల జల్లు కురిపిస్తున్నారు. సీఎం ప్రత్యేక నిధి కింద కేటాయించిన రూ.10 వేల కోట్ల నుంచే ఈ వరాలకు నిధులు సర్దాలని యోచించారు. కానీ, ఏ జిల్లా హామీలూ పూర్తి స్థాయిలో అమలు కావడంలేదు. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ)’ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఈ సీడీపీ కింద సంవత్సరం మొత్తంలో ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి రూ.5 కోట్ల చొప్పున నిధులను విడుదల చేయాల్సి ఉంది. మొదట్లో సీడీపీ కింద రూ.కోటి వరకే ఇచ్చేవారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా లేని ఆడంబరాలకు పోయి.. దీనిని రూ.3 కోట్లకు, ఆ తర్వాత రూ.5 కోట్లకు పెంచింది. కానీ, నిధుల విడుదల మాత్రం నిలిపివేసింది. దీంతో పనుల తాలూకు ప్రొసీడింగ్స్‌ ఇచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిధులు రాకపోవడంతో తలబాదుకుంటున్నారు.

Updated Date - 2023-07-30T04:15:07+05:30 IST