Share News

CM Revanth Reddy: ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే శ్వేతపత్రం విడుదల చేశాం

ABN , Publish Date - Dec 20 , 2023 | 08:39 PM

తాము విడుదల చేసిన శ్వేతపత్రం ఎవరినో కించపరచడానికో, అవమానించడానికో కాదని.. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే విడుదల చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తన పదేళ్ల పాలనలో...

CM Revanth Reddy: ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే శ్వేతపత్రం విడుదల చేశాం

CM Revanth Reddy About White Paper: తాము విడుదల చేసిన శ్వేతపత్రం ఎవరినో కించపరచడానికో, అవమానించడానికో కాదని.. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే విడుదల చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తన పదేళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందు పెట్టామన్నారు. ఆర్‌బీఐ, కాగ్ నుంచి సమాచారం తీసుకున్నామని.. అవసరమైన చోట వాటి నివేదికల్ని కూడా శ్వేతపత్రంలో ప్రస్తావించామని ఆయన క్లారిటీ ఇచ్చారు. అర్హులైన వారికి సంక్షేమం అందించి, తెలంగాణను దేశంలోనే బలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ శ్వేతపత్రం తాము ప్రకటించిన గ్యారెంటీలను ఎగ్గొట్టడానికి కాదని.. వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించేందుకే అని తెలియజేశారు. ఆర్ధిక శాఖ కార్యదర్శి సంతకం పెట్టి ఇచ్చిందే ఈ నివేదిక అని తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వానికి అధికారం అప్పగించే నాటికి రిజర్వ్ బ్యాంకు వద్ద మన నిధుల నిల్వలు సగటున 303 రోజులు ఉండేవని.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సగటున ఇందులో సగం రోజులు కూడా లేవని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వాస్తవాలు దాచి గొప్పలు చెప్పుకోవడం వల్లే.. ఇప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, రోజూ అప్పు కావాలని వాళ్ల దగ్గర నిలబడాల్సి వస్తోందని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధానిని కలిసేందుకు తాను కిషన్ రెడ్డికి ఫోన్ చేశానన్నారు. స్వార్ధ రాజాకీయాల కోసం కాకుండా ప్రజల కోసమే తాము ఆలోచిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవని.. ప్రతి నిర్ణయానికి ముందు అఖిలపక్షం సలహాలు, సూచనలు తీసుకుంటామని అన్నారు. వాస్తవాలు కఠోరంగా ఉన్నప్పుడు వాటిని అంగీకరించాలని సూచించారు. చివరికి మన కుటుంబ సభ్యులు తప్పు చేసినా.. ఆ తప్పుని అంగీకరించాల్సిందేనని అన్నారు.


కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ నేతలు లక్షల కోట్లు దుర్వినియోగం చేశారని, అబద్దాలతో వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని, ఇప్పుడేమో సత్యహరిశ్చంద్రుల్లా మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ సృష్టించిన సంపదను తనఖా పెట్టి, బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు తెచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ కూడబెట్టిన రూ.4,972 కోట్ల విద్యుత్ శాఖ ఆస్తులను బీఆర్ఎస్ తనఖా పెట్టిందన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో రూ.13 లక్షల 72 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఇంత ఖర్చు చేసినా ప్రజలు చేసిందేమీ లేదని, పేదలకు డబుల్ బెడ్రూంలు, దళితులకు మూడెకరాలు భూమి ఇవ్వలేదన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు ఇవ్వలేదన్న ఆయన.. రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులు కూడా విడుదల చేయని పరిస్థితి నెలకొందన్నారు. సెక్రటేరియట్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వని పరిస్థితి ఉందన్నారు.

ప్రతీ నెలా మొదటి తారీఖున రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వని దుస్థితి ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాను పెద్దకొడుకునని చెప్పుకున్న ఆ పెద్దమనిషి.. ఆసరా పెన్షన్లు ఇవ్వని పరిస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు. నాలుగు నెలల ముందే వైన్స్ టెండర్లు వేసి ఉన్నదంతా దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్ధిక విధ్వంసం సృష్టించారని.. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా బీఆర్ఎస్ నెరవేర్చలేదని తూర్పారపట్టారు. లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామని అన్నారని, ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి కడతామని మాటిచ్చారని.. కానీ ఆ హామీలేవీ పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. నిజాలు చెబితే పరువు పోతుందని అంటున్నారని.. కానీ ఊరికే ఉంటే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని.. అందుకే వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Updated Date - Dec 20 , 2023 | 08:39 PM