TS News: కొంగ, దొంగ జపం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ: జగదీష్‌రెడ్డి
ABN , First Publish Date - 2023-06-01T20:01:59+05:30 IST
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంగ జపం చేస్తుండగా, బీజేపీ దొంగ జపం చేస్తోందని, అది కూడా అధికారం కోసమేనని మంత్రి జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు.
సూర్యాపేట: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంగ జపం చేస్తుండగా, బీజేపీ దొంగ జపం చేస్తోందని, అది కూడా అధికారం కోసమేనని మంత్రి జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలపై బీజేపీ, కాంగ్రెస్ (BJP Congress) పార్టీల వైఖరిని జగదీష్‌రెడ్డి దుయ్యబట్టారు. అధికారం కోసం జరుగుతున్న పరుగు పందెంలో బీఆర్‌ఎస్ (BRS)తో పోటీ పడేందుకే దశాబ్ది ఉత్సవాలను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో రాజీనామాలు అంటేనే తోక ముడిచిన ఆ రెండు పార్టీలకు దశాబ్ది ఉత్సవాల గురించి మాట్లాడే నైతికత ఎక్కడిదని ప్రశ్నించారు. ఏడు దశాబ్దాలుగా తెలంగాణను గాడాంధకారంలోకి నెట్టిన కాంగ్రెస్ పార్టీ దశాబ్ది ఉత్సవాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. తెలంగాణ (Telangana) కోసం రాజీనామా అంటేనే తోక ముడిచిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తొమ్మిదేళ్లలో ఊహకు మించిన అభివృద్ధిని సాధించుకున్నందునే దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలో వెలుగు జిలుగులు విరజిమ్ముతున్నాయని తెలిపారు. వరి దిగుబడిలో సాధించిన విజయాలు సీఎం కేసీఆర్ పాలనకు తార్కాణమని జగదీష్‌రెడ్డి గుర్తుచేశారు.