YS Sharmila: షర్మిలకు కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు
ABN , First Publish Date - 2023-10-01T04:32:14+05:30 IST
వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిలకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. ఆమె సోమ లేదా మంగళవారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది.
హైదరాబాద్, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిలకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. ఆమె సోమ లేదా మంగళవారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఈ దఫా పర్యటనలో కాంగ్రె్‌సలో తమ పార్టీ విలీనానికి సంబంధించి పూర్తిస్థాయి స్పష్టత రానుందని వైఎస్సార్‌టీపీ వర్గాలు తెలిపాయి. విలీనం అంశానికి సంబంధించి సెప్టెంబరు 30ని డెడ్‌లైన్‌గా పెట్టుకున్న షర్మిల.. ఆ మేరకు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు రంగంలోకి దిగి షర్మిలతో సంప్రదింపులు జరిపారు. పార్టీ అధిష్ఠానం పెద్దలతోనూ మాట్లాడించారు.
ఈ సందర్భంగా ఢిల్లీకి రావాల్సిందిగా షర్మిలను ఆహ్వానించారు. వాస్తవానికి కాంగ్రె్‌సలో వైఎస్సార్‌టీపీ విలీనానికి స్థూలంగా అంగీకారం కుదిరినా తెలంగాణ స్థానికతే షర్మిల కోరుతుండడం మొత్తం ప్రక్రియలో చిక్కుముడిగా మారింది. తాను పాలేరు నుంచి పోటీ చేస్తానంటూ అధిష్ఠానం ముందు ఆమె ప్రతిపాదించారు. అయితే షర్మిల సేవలను ఏపీలోనే వాడుకోవాలని, తెలంగాణ కాంగ్రెస్ నుంచి వద్దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆయన వర్గం నేతలు మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అలాగే షర్మిల కూడా ఒక మెట్టు దిగి పాలేరు నుంచి పోటీ ప్రతిపాదనను విరమించుకున్నట్లు సమాచారం. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం సీటు ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆమె చేసే అవకాశం ఉన్నట్లు వైఎస్సార్‌టీపీ వర్గాలు చెబుతున్నాయి.