Yadadri: యాదగిరిక్షేత్రంలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2023-04-22T21:55:40+05:30 IST

యాదాద్రీశుడికి శనివారం నిత్యారాధనలు ఆగమ శాస్త్రరీతిలో ఘనంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతం, బిందెతీర్థంతో నిత్యారాధనలు ఆరంభించిన..

Yadadri: యాదగిరిక్షేత్రంలో భక్తుల రద్దీ

యాదగిరిగుట్ట: యాదాద్రీశుడికి శనివారం నిత్యారాధనలు ఆగమ శాస్త్రరీతిలో ఘనంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతం, బిందెతీర్థంతో నిత్యారాధనలు ఆరంభించిన ఆచార్యులు రాత్రి వేళ శయనోత్సవ పర్వాలతో ఆలయ ద్వారబంధనం చేశారు. గర్బగుడిలోని స్వయంభువులను, సువర్ణ ప్రతిష్టా అలంకార కవచమూర్తులను వేదమంత్ర పఠనాలు, మంగళవాయిధ్యాల నడుమ అభిషేకించి తులసిదళాలతో అర్చించారు. అష్టభుజిప్రాకార మండపంలో హోమం, నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలు ఆగమ శాస్త్రరీతిలో కొనసాగాయి. ప్రధానాలయ ముఖమండపంలో ఉత్సవమూర్తుల చెంత సువర్ణ పుష్పార్చనలు, అష్టోత్తర పూజల్లో భక్తులు కుటుంబసమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కొండపైన అనుబంధ శివాలయంలో రామలింగేశ్వరుడికి నిత్యారాధనలు శైవ సంప్రదాయరీతిలో కొనసాగాయి.

తిరువీధుల్లో భక్తుల సందడి

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy) సన్నిధిలో శనివారం భక్తుల (Devotees) సందడి నెలకొంది. వారాంతపు సెలవురోజు కావడంతో లక్ష్మీనృసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్షేత్ర సందర్శనకు వచ్చారు. దేవదేవుడి దర్శనాల కోసం విచ్చేసిన భక్తులతో కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, బస్టాండ్‌, కొండపైన ఆలయ తిరువీధులు, ఉభయ దర్శన క్యూలైన్లు, ప్రధానాలయం, ప్రసాదాల విక్రయశాల తదితర ప్రాంతాలు కోలాహలంగా కనిపించాయి. నృసింహుడిని దర్శించుకునేందుకు ధర్మదర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. 25 వేల మందికి పైగా భక్తులు నృసింహుడిని దర్శిచుకోగా విభాగాల ద్వారా రూ.39,98,455 ఆదాయం సమకూరింది.

Updated Date - 2023-04-22T21:55:40+05:30 IST