Cyber crimes: అబ్బో.. బాగానే డవలప్ అయ్యారుగా.. ముంబై తర్వాత మనమే..
ABN , First Publish Date - 2023-12-10T07:41:04+05:30 IST
సైబర్ నేరాల్లో(Cyber crimes) టాప్ ప్లేస్‌లో ఉన్న నగరంలో సాధారణ మోసాల్లోనూ తక్కువేమీ లేదు. ఫోర్జరీ పత్రాలతో.. మాయమాటలతో
- గత ఏడాది ఆర్థిక నేరాల్లో 6,230 కేసులు
- జాతీయ నేర గణాంకాలు వెల్లడి
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరాల్లో(Cyber crimes) టాప్ ప్లేస్‌లో ఉన్న నగరంలో సాధారణ మోసాల్లోనూ తక్కువేమీ లేదు. ఫోర్జరీ పత్రాలతో.. మాయమాటలతో మోసాలతో ఆర్థిక నేరాల్లో హైదరాబాద్ నగరం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. 2022కి గాను జాతీయ నేర గణాంకాల పట్టిక వెల్లడించిన నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో ఆర్థిక నేరాలు విపరీతంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా 19 మెట్రో నగరాల గణాంకాలను ఎన్‌సీఆర్‌డీ వెల్లడించింది.
ముంబై టాప్
ఎన్‌సీఆర్‌బీ వెల్లడించిన తాజా లెక్కల ప్రకారం దేశ ఆర్థిక రాజధాని ముంబై ఆర్థిక నేరాలు, మోసాల్లోనూ టాప్‌లో ఉంది. 2022లో 6,960 ఆర్థిక నేరాలతో ముంబై ప్రథమ స్థానంలో ఉండగా... 6,230 నేరాలతో హైదరాబాద్(Hyderabad) రెండో స్థానాన్ని ఆక్రమించింది. దేశ రాజధాని ఢిల్లీ 5,007 నేరాలతో మూడో స్థానంలో ఉంది. ముంబైలో నమోదైన మొత్తం ఆర్థిక నేరాల్లో 1,093 కేసులు నమ్మకద్రోహం మోసాలు కాగా, 5,855 ఫోర్జరీ, చీటింగ్ కేసులున్నాయి. ఇతరత్రా మరో 12 కేసులున్నాయి. హైదరాబాద్‌లో నమ్మకద్రోహానికి సంబంధించి 215 కేసులు నమోదు కాగా.. చీటింగ్, ఫోర్జరీకి సంబంధించి 5,815 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్, ఢిల్లీలో ఆర్థిక నేరాలకు సంబంధించి సుమారు 19 కేసులు, రూ. 10కోట్ల నుంచి రూ. 100కోట్ల మోసానికి సంబంధించినవి ఉన్నాయి.