Yadadri: యాదగిరిక్షేత్రంలో భక్తుల కోలాహలం
ABN , First Publish Date - 2023-04-09T20:16:58+05:30 IST
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy) సన్నిధిలో ఆదివారం భక్తుల (Devotees) కోలాహలం నెలకొంది.
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy) సన్నిధిలో ఆదివారం భక్తుల (Devotees) కోలాహలం నెలకొంది. వారాంతపు సెలవు రోజు కావడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇష్టదైవాలను దర్శించుకున్నారు. దీంతో కొండకింద బస్‌స్టాండ్, కల్యాణకట్ట, పట్టణ ప్రధాన వీధులు భక్తుల వాహనాలతో సందడిగా కనిపించాయి. కొండపైన బస్‌బే, దర్శన క్యూలైన్లు, ప్రదానాలయం, ప్రసాదాల విక్రయశాల తదితర ప్రాంతాల్లో భక్తుల రద్దీ నెలకొంది. భక్తుల హరిహర నామస్మరణలతో క్షేత్రం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. దర్శనానంతరం స్వామివారి ప్రసాదాలను కొనుగోలు చేసిన భక్తులు ఘాట్‌రోడ్, పెద్దగుట్టపైన, రాయిగిరి తదితర ప్రాంతాల్లోని గార్డెన్లలో పిల్లా పాపలతో సేదతీరారు. దేవదేవుడి ధర్మదర్శనాలకు ఐదు గంటలు, ప్రత్యేక దర్శనాలకు మూడు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. 50వేల మందికి పైగా భక్తులు లక్ష్మీనృసింహుడిని దర్శించుకోగా, వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.64,46,277 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. స్వామికి నిత్యారాధనలు ఘనంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతంతో ఆరంభమైన నిత్యపూజలు రాత్రివేళ శయనోత్సవ పర్వాలతో ఆలయ ద్వారబంధనం చేశారు.
స్వామిసేవలో ప్రముఖులు
యాదగిరీశుడిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కె.రఘోత్తమ్‌రెడ్డి, రాజన్న సిరిసిల్ల పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గన్నమనేని శ్రీనివాస్‌రావు, పీఆర్‌టీయూపీఎస్ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు పింగళి శ్రీపాల్‌రెడ్డి, కమలాకర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవిందర్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యుడు మహాబీర్‌సింగ్ దర్శించుకున్నారు. వీరికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించారు.
ఎండ తీవ్రతకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
యాదగిరికొండపైన భక్తులు ఎండ తీవ్రత నుంచి తట్టుకునేందుకు దేవస్థాన అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. వేసవికాలం ఆరంభంలోనే భానుడి ప్రతాపానికి క్షేత్ర సందర్శనకు విచ్చేసిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో దేవస్థాన అధికారులు కొండపైన భక్తుల సౌకర్యార్థం ఆలయ తిరువీధుల్లో కూల్ పెయింట్, అవసరమైన ప్రదేశాల్లో కార్పెట్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే, కొండపైకి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు గంటల తరబడి వేచివుండాల్సి వచ్చిందని, రద్దీ సమయాల్లోనైనా బస్సుల సంఖ్య పెంచాలని భక్తులు కోరుతున్నారు.