Janakipuram Sarpanch Navya: జానకీపురం సర్పంచ్, ఎమ్మెల్యే రాజయ్య మధ్య సయోధ్య.. సర్పంచ్ ఇంటికి ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2023-03-12T15:40:38+05:30 IST
జానకీపురం సర్పంచ్ నవ్య (Janakipuram Sarpanch Navya), ఎమ్మెల్యే రాజయ్య మధ్య సయోధ్య కుదిరింది. కాసేపట్లో జానకీపురం సర్పంచ్ ఇంటికి ఎమ్మెల్యే ...
వరంగల్: జానకీపురం సర్పంచ్ నవ్య (Janakipuram Sarpanch Navya), ఎమ్మెల్యే రాజయ్య మధ్య సయోధ్య కుదిరింది. కాసేపట్లో జానకీపురం సర్పంచ్ ఇంటికి ఎమ్మెల్యే రాజయ్య (MLA Rajaiah) వెళ్లనున్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత సర్పంచ్ నవ్య దంపతులకు ఎమ్మెల్యే క్షమాపణ చెబుతారని ప్రచారం జరుగుతోంది. పార్టీ పెద్దల ఒత్తిడితో సర్పంచ్ ఇంటికి ఎమ్మెల్యే వెళ్తున్నారని సమాచారం. రాజయ్య తనను లైంగికంగా వేధించారని ఇటీవల నవ్య ఆరోపణలు చేశారు. పార్టీ పెద్దల జోక్యంతో వివాదం తెరపడనుంది.
సర్పంచ్‌కు బీఆర్ఎస్ మహిళా నేత వల
‘‘నీకసలు లోకం పోకడ తెలియదు. రాజకీయాలు అంటే ఏంటో తెలియవు. ఎమ్మెల్యే చెప్పినట్టు వింటేనే మనకు పనులవుతాయి. లేదంటే నీకు నరకం కనిపిస్తుంది. నేను చెప్పినట్టు విను. ఎమ్మెల్యేకు నీ మీద చాలా ఇంట్రస్ట్ ఉంది. ఒక్కసారి వచ్చి కలువు. అది కూడా భర్త లేకుండా ఒంటరిగా రావాలి. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో’’.. ఇదీ హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని బీఆర్ఎస్ (BRS) సీనియర్ మహిళా నాయకురాలు ఓ మహిళా సర్పంచ్‌ను ఇలా ప్రలోభాలకు గురిచేశారు జానకీపురం మహిళా సర్పంచ్ కురసపల్లి నవ్యను ఆ నాయకురాలు అన్ని రకాలుగా ప్రలోభపెట్టింది. కానీ, నవ్య లొంగలేదు. అంతే.. ఆమె చెప్పిందే నిజమైందని, ప్రలోభాలకు లొంగకపోవడంతో తనకు అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయని నవ్య వాపోయారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధించింది నిజమేనని ఆమె చెప్పారు.
‘‘నీకు సర్పంచ్ టికెట్ నీ భర్తను చూసి కాదు.. నిన్ను చూసి, నీ మీద కోరికతో, ఆశతో మాత్రమే ఇచ్చా. నాకు సహకరించకపోతే గ్రామ అభివృద్ధికి ఏమాత్రం సహకరించను. గ్రామ ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించే విధంగా చేస్తా’’ అని ఎమ్మెల్యే బెదిరించేవారని నవ్య తెలిపారు. ఆయన మాటలను నిరాకరించినందుకుగాను.. గ్రామ అభివృద్ధికి సహకరించక పోగా గ్రామంలో గ్రూపులు ఏర్పాటు చేసి తమకు విలువ లేకుండా చేశారని ఆమె ఆరోపించారు.
చిలిపి చేష్టలకు కేరాఫ్.. ఆ ఎమ్మెల్యే!
ఆ ఎమ్మెల్యేకు మహిళలు కనిపిస్తే చాలు.. ఆగలేరన్న ప్రచారం ఉంది. ప్రచారమే కాదు.. అనేక సార్లు ఆయన చిలిపి చేష్టల ఆడియోలు నెట్టింట వైరల్ కూడా అయ్యాయి. ఆయన పుట్టినరోజు వేడుకల్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఆ వీడియో కూడా వైరలైంది. ఆయన పెద్ద పదవిలో ఉన్నప్పుడు సాయుధ బలగాల రక్షణ వలయంలో గంటల తరబడి ‘ఓ ఇంట్లో’ సేద తీరడంతో.. ఆ ఊరి వారంతా ఇబ్బంది పడ్డారు. చాటింగ్లకు కేరా్‌ఫగా చెప్పుకొనే ఈ ఎమ్మెల్యే.. చేసిన ఓ చాటింగ్ మిస్‌ఫైర్ అయి పదవి పోవడానికి కారణమైందన్న ప్రచారం ఉంది.