Draupadi Murmu: హెల్త్ హబ్‌గా హైదరాబాద్.. తెలంగాణ కోటి రతనాల వీణ
ABN , Publish Date - Dec 21 , 2023 | 09:21 AM
హైదరాబాద్ కేవలం ఐటీ హబ్ మాత్రమే కాదు.. ఓ మంచి హెల్త్ హబ్ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) తెలిపారు.
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
హైదరాబాద్ సిటీ/సికింద్రాబాద్, (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ కేవలం ఐటీ హబ్ మాత్రమే కాదు.. ఓ మంచి హెల్త్ హబ్ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) తెలిపారు. పరేడ్‌గ్రౌండ్స్‌లో బుధవారం సాయంత్రం జరిగిన ఎంఎన్‌ఆర్ విద్యా సంస్థల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు ఆమె హాజరయ్యారు. రాష్ట్రపతి మాట్లాడుతూ ఏడాది క్రితం ఆమె తొలిసారి రాష్ట్ర పర్యటన నేపథ్యంలో వివిధ దేవాలయాల పర్యటనను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ యువకులు దాశరథి కృష్ణమాచార్యులు, కాళోజీల రచనల నుంచి ప్రేరణ పొందుతుంటారని చెప్పారు. ఈ సందర్భంగా ‘నా తెలంగాణ కోటి రతణాల వీణ’ అంటూ అప్పట్లో దాశరథి కృష్ణమాచార్యులు పొగిడారని ఆమె గుర్తు చేశారు. విద్య, వైద్య శిక్షణలో 50ఏళ్లుగా కృషి చేస్తున్న ఎంఎన్‌ఆర్ సంస్థల నిర్వాహకులు, శిక్షకులు,. అందులో శిక్షణ పొందిన, పొందుతున్న వారిని ఆమె అభినందించారు. ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్ సంపన్నమైన తెలంగాణలో భాగమని కొనియాడారు. ఇక్కడ నుంచి శిక్షణ పొందిన వారెందరో ఐటీ యోధులు దేశ విదేశాల్లో తమ రాష్ట్ర ఉనికిని, ప్రతిష్ఠను చాటుతున్నారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న వైజ్ఞానిక రంగంలో హైదరాబాద్‌కు చెందిన ఐటీ కంపెనీలు, ఐటీ నిపుణులదే కీలక పాత్ర అని కొనియాడారు. 2047 (దేశ స్వాతంత్ర శతజయంతి ఉత్సవాలు) నాటికి సంపూర్ణ ఆరోగ్య భారత్ లక్ష్యమన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పరేడ్‌గ్రౌండ్‌లో ఎంఎన్‌ఆర్ విద్యాసంస్థల కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. తొలుత ఎంఎన్‌ఆర్ విద్యాసంస్థల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మంత్రి సీతక్క, విద్యాసంస్థల చైర్మన్ ఎంఎన్ రాజు, ట్రస్టీ వైస్ చైర్మన్ ఎంఎస్ రవి తదితరులు పాల్గొన్నారు.